రెండు రోజుల డిజిటల్ మహానాడులో నేతల మధ్య జరిగిన సంభాషణల్లో ఓ విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే చాలావర్గాలు తెలుగుదేశంపార్టీకి దూరమైపోయాయనే విషయం. దూరమైపోయిన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవటం ఎలాగ అనే అంశంపై చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఇదే విషయమై సోమిరెడ్డి మాట్లాడుతు టీడీపీకి క్రిస్తియన్, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజికవర్గాలు దూరమైపోయిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి అండగా నిలబడిన ఎస్టీలు, ముస్లింలు దూరమైపోవటం వల్ల చాలా నష్టం జరిగిందని సోమిరెడ్డి స్పష్టంగా చెప్పారు. కాబట్టి దూరమైపోయిన వర్గాలను దగ్గరకు తీసుకోవాలంటే వాళ్ళని ఆదరించాలనే తీర్మానం చేయాలని సోమిరెడ్డి పట్టుబట్టారు. అయితే అందుకు చంద్రబాబు, యనమల అంగీకరించలేదు. పై కులాలకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయాలేదని ఒప్పుకున్నట్లవుతుందని యనమల వాదించారు.
ప్రత్యేకంగా పై సామాజికవర్గాలను కలుపుకుని వెళ్ళాలనే తీర్మానం పెడితే తమంతట తాముగానే పై వర్గాలను దూరం చేసుకున్నట్లవుతుందని గట్టిగా వాధించారు. మహానాడులో తీర్మానం చేయటంకన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్లోకి చూపిస్తేనే బాగుంటుందని చంద్రబాబు మాటకు యనమల మద్దతిచ్చారు. ఇదే సమయంలో సోమిరెడ్డి మాట్లాడుతూ దూరమైన వర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలంటే ఏదో ఒక తీర్మానం చేయకపోతే వాళ్ళల్లో నమ్మకం ఎలా కలుగుతుందని లేవనెత్తిన సందేహానికి ఎవరు సమాధానం చెప్పలేదు.
మొత్తంమీద మహానాడు వేదికగా పార్టీకి దూరమైన సామాజికవర్గాల విషయంలో వాస్తవాలు మాట్లడుకున్నారనే అనుకోవాలి. ఏ ఏ వర్గాలు టీడీపీకి దూరమైపోయాయనే విషయంలో సోమిరెడ్డి లెక్కను యనమల బలపరిచారు. రాయలసీమ, తెలంగాణాలో రెడ్లంతా టీడీపీకి దూరమైపోయారని సోమిరెడ్డి చెప్పినపుడు చంద్రబాబు, యనమల ఏమీ మాట్లాడలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates