జయలలిత బతికి ఉండగా కమల్ హాసన్‌ను రాజకీయ రంగప్రవేశం గురించి అడిగితే తనకు ఆసక్తి లేదన్నట్లు మాట్లాడాడు. తన లాంటి వాడికి రాజకీయాలు పడవని తేల్చేశాడు. కానీ జయ మరణానంతరం ఆయన ఆలోచనలు మారిపోయాయి. కరుణానిధి కూడా మంచం పట్టడం, ఎన్నో రోజులు బతికే అవకాశం లేదని తేలిపోవడంతో తమిళనాట నెలకొనబోయే రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు. వెంటనే రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
మూడేళ్ల ముందే పార్టీ మొదలుపెట్టి.. కొంత వరకు క్షేత్రస్థాయిలో తిరిగి జనాదరణ కూడా సంపాదించుకున్నట్లే కనిపించాడు. కానీ కమల్ సత్తా ఏంటో రెండేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లోనే తెలిసిపోయింది. ఆయన పార్టీ అభ్యర్థులెవరూ ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఐతే కమల్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే.. నేరుగా తనే ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుందనుకున్నారు.
కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అవి రెండూ జరిగాయి. కమల్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. క్షేత్రస్థాయిలో తిరిగారు. తానూ ఎన్నికల బరిలో నిలిచారు. తన పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టారు. కొన్ని పార్టీలో పొత్తులు కూడా పెట్టుకున్నారు. కానీ ఏం ప్రయోజనం? ఒక్కటంటే ఒక్క సీటు సాధించలేకపోయారు. స్వయంగా తనే ఓడిపోయారు. ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో కమల్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.
మొన్నటిదాకా కమల్‌కు ఏమాత్రం గిట్టని బీజేపీ మద్దతుగా అన్నాడీఎంకే అధికారంలో ఉండేది. కమల్ పోరాడటానికి, విమర్శలు చేయడానికి అనువుగా ఉండేది. కానీ డీఎంకే, స్టాలిన్ పట్ల కమల్ ఎప్పుడూ అంత వ్యతిరేకత ప్రదర్శించలేదు. పైగా ఆయనకు ఎన్నికల సందర్భంగా స్టాలిన్ పరోక్షంగా సాయపడ్డారనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి స్థితిలో కమల్ రాజకీయాల్లో కొనసాగి ఎవరి మీద పోరాడతాడు. పార్టీని ఎలా నిలబెట్టుకుంటాడు. తనే ఓడిపోయి మిగతా వారిలో ఏం స్ఫూర్తి నింపుతాడు. ఈ నేపథ్యంలో గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని.. త్వరలోనే ఈ దిశగా ఆయన ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates