నిన్న బాబు.. నేడు చిన్న‌బాబు.. క్రిమిన‌ల్ కేసులు

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ట్విటర్‌లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ ఎస్టీ సెల్‌ నేత భోజరాజు నాయక్‌ ఫిర్యాదు చేశారు. వివరాలు… టీడీపీ కార్యకర్త మారుతిపై కర్ణాటకలో కొంద‌రు వ్యక్తులు దాడి చేశారు. అయితే, దీని వెనుక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారంటూ.. నారా లోకేశ్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు. వెంట‌నే స్పందించిన భోజరాజు నాయక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో పోలీసులు.. హుటాహుటిన ఆగ‌మేఘాల‌పై స్పందించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించారని నారా లోకేశ్‌పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు.. అదికార పార్టీకి కూడా నష్టం కలిగించేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపారు. దీంతో ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే.. ఈ కేసు న‌మోదుపై.. టీడీపీ నేత‌లు నిప్పులు చెరిగారు. వైసీపీ నేత‌లు బనాయించే అక్రమ కేసులకు భయపడేది లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే మారుతిపై జరిగిన దాడిని లోకేశ్ ఖండిస్తే, ఆయనపై అక్రమ కేసు పెట్టారని కాల్వ ఆరోపించారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా వనరులను కొల్లగొడుతున్నా రని మండిపడ్డారు. దుర్మార్గాలను ప్రశ్నిస్తే, దాడులు చేసి అక్రమ కేసుల్లో ఇరికించడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందని విమర్శించారు. డి.హీరేహాళ్‌ మండలంలో వైసీపీ నాయకుల దోపిడీని త్వరలోనే ప్రజలముందు పెడతామని ఆయన చెప్పారు. తప్పుడు కేసులను తిప్పికొడుతూనే దొంగల ముఠా అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు.

లోకేష్ రియాక్ష‌న్ ఇదీ..
త‌న‌పై న‌మోదు చేసిన కేసు విష‌యంలో నారా లోకేష్ ట్విట్ట‌ర్‌లో దీటుగా స్పందించారు.

  • హింసించే పుల‌కేశి రెడ్డి గారు, నాపై ఇంకా ఎన్ని అక్ర‌మ కేసులు పెడ‌తావో పెట్టుకో, నేను రెడీ. తెలుగుదేశం కార్య‌క‌ర్త మారుతి పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన వైసీపీ వారిని ప్ర‌శ్నించిన నాపై కేసు పెట్టిన వైసీపీ పోలీసులూ, దాడుల‌కు పాల్ప‌డుతోన్న వైసీపీపై ఎందుకు కేసులు పెట్ట‌రు?
  • క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌లమ‌య్యార‌ని ఆరోపించిన టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు గారిపై త‌ప్పుడు కేసు, అవినీతిని నిల‌దీసిన టిడిపి ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి గారిపై అక్ర‌మ అరెస్టు, టిడిపి కార్య‌క‌ర్త‌ల‌పై దాడులేంట‌ని ప్ర‌శ్నించిన‌ నాపై ఫేక్ కేసు.
  • నువ్వు అధికారంలోకొచ్చింది ప్ర‌జ‌ల్ని ర‌క్షించేందుకా? ప్ర‌తిప‌క్షంపై క‌క్ష తీర్చుకునేందుకా?అధికారం అండ‌గా అక్ర‌మ‌కేసుల‌తో ప్ర‌తిప‌క్షాన్ని బెదిరించి, భ‌య‌పెట్టాల‌నుకుంటున్నావు.
  • తెలుగుదేశం అధ్య‌క్షుడి నుంచి అభిమాని వ‌ర‌కూ, కార్య‌క‌ర్త నుంచి కార్య‌ద‌ర్శి వ‌ర‌కూ ఎవ్వ‌రూ నీ కేసులకు భ‌య‌ప‌డ‌రు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)