అవును తాజా ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించిన ముగ్గురని సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, మమతాబెనర్జీ. ఇపుడు సాధించిన ముగ్గురికి ఈ విజయాలు చాలా అపూర్వమనే చెప్పాలి. అందుకనే 1,2,3 అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు వీళ్ళగురించి.
ఇంతకీ విషయం ఏమిటంటే తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్ మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే కేరళలో రెండోసారి అధికారంలో కంటిన్యు అవటానికి పనరయి విజయన్ చాలా కష్టపడ్డారు. విజయన్ కష్టం ఫలించి కేరళలో ఐదేళ్ళకోసారి అధికారమార్పిడి ఆనవాయితీని కూడా జనాలు పక్కన పెట్టి ఎల్డీఎఫ్ కూటమినే గెలిపించారు. అలాగే పశ్చిమబెంగాల్లో మమతబెనర్జీ ఏ పరిస్ధితిలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
స్టాలిన్ కు పార్టీ పగ్గాలు దక్కి చాలాకాలమే అయినా ఎన్నికల్లో సారధ్యం వహించటం ఇదే మొదటిసారి. పార్టీకి సారధ్యం వహించిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లోనే అధికారంలోకి రావటానికి మించిన సంతోషం ఏముంటుంది. అలాగే కేరళలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి అధికారాన్ని మార్చేసే సంప్రదాయం ఉంది. అయితే గడచిన ఐదేళ్ళల్లో తుపానులు వచ్చినపుడు, కరోనా సమస్యను విజయన్ హ్యాండిల్ చేసిన విధానంతో జనాలు హ్యాపీగా ఫీలైనట్లున్నారు.
అందుకనే ఆనవాయితీని పక్కనపెట్టి మళ్ళీ విజయన్ కు రెండోసారి అధికారం అప్పగించారు. గోల్డ్ స్కామ్ లో విజయన్ హస్తం ఉందని సీబీఐ, ఈడీ లు ఎంత రాద్దాంతం చేసినా జనాలు నమ్మలేదు. ఇక బెంగాల్లో మమత పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మోడి, అమిత్, జేపీ నడ్డా అండ్ కో అంతా ఒకవైపు మమత ఒక్కరే ఒకవైపు నిలబడ్డారు. ఒంటి కాలితోనే వాళ్ళందరినీ ఎదుర్కొన్నారు. పెద్ద పోరాటమే చేసి చివరకు హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు. కాబట్టే వీళ్ళ ముగ్గురు స్పెషల్.
Gulte Telugu Telugu Political and Movie News Updates