“దేశంలో కరోనా విశ్వరూపంపై కేంద్రం ఏం చేస్తోంది? టీకా విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి? ఎస్సీ , ఎస్టీ వర్గాలకు.. రిజర్వేషన్ ప్రాతిపదికన.. టీకా ఎందుకు ఇవ్వకూడదు?”.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ముంచెత్తింది. అదే సమయంలో పలు సూచనలు, సలహాలు చేసింది. ఇక, కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
జాతీయ అత్యవసర పరిస్థితి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం, వ్యాక్సిన్ కొరత, వైద్యంలో లోపాలు.. మృతుల సంఖ్య పెరుగుతుండడం వంటి అనేక విషయాలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. ఈ అఫిడవిట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. కేంద్ర-రాష్ట్రాల మధ్య కరోనాపై సరైన సమాచార మార్పిడి లేనట్టుగా ఉందని పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని.. పేర్కొంది.
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలాగేనా?
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ విషయంలోని లోపాలను సైతం సుప్రీం కోర్టు తెరమీదికి తెచ్చింది. నిరక్షరాస్యులు, గ్రామీణులు.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని.. దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అని ప్రశ్నించింది. అమికస్ క్యూరీగా మీనాక్షి అరోరా వ్యవహరించిన ఈ కేసులో .. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
- రాష్ట్రాలకు ఆక్సినజన్ సరఫరాలపై వివరాలు సమర్పించాలి.
- శ్మశాన వాటికల్లో పనిచేసేవారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారా?
- పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం టీకాపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?
- టీకా ధరల విషయంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య తేడా ఎందుకు?
- జీతీయ టీకా విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదు
- టీకా పంపిణీలో కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా?
- టీకా తయారీ దారుల నిర్ణయాలకే ధరలను వదిలేయొద్దు
- దేశంలో 18-45 ఏళ్ల జనాభా ఎంత?
- టీకాల ఉత్పత్తిలో కేంద్రం పెట్టుబడులు ఎంత అనేది అఫిడవిట్లో ఇవ్వండి
- టీకా ధరలను ఎలా నియంత్రిస్తున్నారు.
- తాత్కాలిక చికిత్స కేంద్రాల ఏర్పాటు మార్గదర్శకాలు ఇచ్చారా?
- వైద్యులకు కరోనా వస్తే.. ఏం చేస్తారు?
- సోషల్ మీడియాలో బాధితులు సాయం కోరడం తప్పుకాదు.
- సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవద్దు
- సమాచార పంపిణీ.. రాజ్యాంగం కల్పించిన హక్కు
- అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఈ ఆదేశం చేరాలి
- ఎస్సీ, ఎస్టీలకు ముందు ఇవ్వాలి.. అవసరమైతే.. రిజర్వేషన్ పాటించాలి.