ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయం. ఏ పార్టీలో ఉన్నా.. ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా జిల్లా రాజకీయాలు ఆయన కనుసైగల్లోనే ఉండేవి. అలాంటి నేత పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఆయన చక్రం తిరగడం లేదా.. చక్రం తిప్పలేకపోతున్నారా ? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తన కనుసైగలతో శాసించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే తుమ్మల రాజకీయ వైభోగం అంతా గతమేనా ? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మలను కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోవటం లేదా ? అంటే ఇప్పుడు ఆ వాదనే బలంగా వినపడుతోంది.
జిల్లాలో 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో గ్రూపులు గ్రూపులుగా ఉన్న వారిలో ఇప్పుడు తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికు పదవులు లేకపోవడంతో ఈ ఇద్దరు నేతలు పూర్తిగా డీలాపడిపోయారు. పువ్వాడ అజయ్ మంత్రి అయ్యాక జిల్లాలో మిగిలిన గ్రూపులకు చాపకింద నీరులా ఎర్త్ పెట్టేస్తూ వస్తున్నారు. విచిత్రం ఏంటంటే గత సాధారణ ఎన్నికలకు ముందు వరకు ప్రత్యర్థి వర్గాలుగా ఉన్న పువ్వాడ, నామా నాగేశ్వరరావు వర్గాలే ఇప్పుడు ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నాయి.
గత సాధారణ ఎన్నికల్లో పువ్వాడ, నామా ఇద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడిన వారే. వీరిలో అజయ్ గెలిచి మంత్రి అయ్యారు. ఇక లోక్‌సభ ఎన్నికల టైంలో పార్టీ మారిన నామా నాగేశ్వరరావు ఎంపీ అయ్యారు. ఒకప్పుడు ఈ ముగ్గురు నేతలకు పడేది కాదు. అలాంటిది ఇప్పుడు తుమ్మలకు కామన్ శత్రువులుగా ఉన్న పువ్వాడ, నామా ఇప్పుడు ఎన్నికల వ్యవహారాలు చక్క పెట్టేస్తున్నారు. గత కార్పోరేషన్ ఎన్నికల్లో తుమ్మల హవానే నడిచింది. ఆయన తన అనుచరులకు పూర్తిగా టిక్కెట్లు ఇప్పించుకుని… అంతా తానై అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు పని లేకపోవడంతో తన పాత కేడర్‌తో సమావేశమవుతూ తూతూ మంత్రంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
కాలమే అన్నింటికి సమాధానం చెపుతుందని.. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌కు మరికొద్ది రోజులు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని తన కేడర్‌కు చెపుతూ నిట్టూర్చడం మినహా తుమ్మల చేసేదేం లేదట.
Gulte Telugu Telugu Political and Movie News Updates