తొందరలో కేంద్రం కీలక నిర్ణయం

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం తొందరలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశాలున్నాయా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు, అత్యున్నతస్ధాయి వర్గాల ఆలోచనలు చూస్తుంటే దేశంలో హెల్త్ ఎమర్జీన్సీ విధించే విషయమై కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. నాలుగురోజల క్రితం సుప్రింకోర్టు కూడా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే విషయమై చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దేశం మొత్తంమీద కరోనా సమస్య పెరిగిపోతున్నది. దేశంలో గడచిన 24 గంటల్లో 3.5 లక్షల కేసులు నమోదుకాగా సుమారు 2900 మంది చనిపోయారు. చనిపోతున్న వారిలో కరోనా వైరస్ కారణం ఒకటి కాగా మరో కారణం ఆక్సిజన్ అందకపోవటం. కరోనా వైరస్ రోగులకు ఒక్కసారిగా ఆక్సిజన్ అవసరం పెరిగిపోతోంది. పెరిగిపోతున్న ఆక్సిజన్ అవసరాలకు తగ్గట్లుగా కేంద్రం ఉత్పత్తిని పెంచలేకపోతోంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచటం, పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తిని సరఫరా చేయటం. ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలన్నా, సరఫరా చేయాలన్నా మామూలు విషయంకాదు. ట్యాంకర్లలో మంచినీటిని నింపేసి దూరప్రాంతాలకు పంపేయటం కాదు ఆక్సిజన్ ట్యాంకర్లలో నింపి సరఫరా చేయటమంటే. దీనికి చాలా పెద్ద ప్రహసనం ఉంటుంది. సమస్య వచ్చినంత హఠాత్తుగా పరిష్కారం సాధ్యంకాదు. అందుకనే సెకెండ్ వేవ్ ను ఎదుర్కోవటంలో ప్రభుత్వాలు ఫెయిలవుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోందట. ఒకవేళ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తే వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా లాంటి అత్యవసరాలన్నింటినీ స్ట్రీంలైన్ చేయటానికి అవకాశం ఉంటుంది. నిజానికి ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోనిదే. కానీ ఇపుడు కరోనా వైరస్ అన్నదే జాతీయ సమస్య కాబట్టి కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించటం తప్ప మరోదారిలేదని అంటున్నారు. మరి ప్రధానమంత్రి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.