సుప్రింకోర్టు దెబ్బ ప్రధానమంత్రి నరేంద్రమోడికి గట్టిగానే తలిగినట్లయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో రోడ్డు షో ను రద్దు చేసుకున్నట్లు మోడి ట్విట్టర్లో తెలిపారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో దేశంమొత్తం వణికిపోతున్న విషయం తెలిసిందే. కేసులు, మరణాలు బాగా ఎక్కువున్న రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఒకటి. ఎన్నికలకు ముందు ఇపుడు కరోనా వైరస్ కేసుల ఉధృతిని లెక్కేస్తే 1500 శాతం వేగంతో కేసులు పెరిగిపోతున్నాయట.
పెరిగిపోతున్న కేసుల కారణంగానే మమత కూడా మిగిలిన మూడు విడతల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. ఏదో మొక్కుబడిగా 8వ విడత పోలింగ్ ముందు మాత్రం బహిరంగసభలో మమత పాల్గొనబోతున్నారు. తాను ప్రచారాన్ని విరమించుకుంటున్న ప్రకటించిన మమత ఇదే విషయంలో నరేంద్రమోడి, అమిత్ షాను చాలెంజ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని తాను నిర్ణయించుకున్నానని ధైర్యముంటే మీరు కూడా ప్రచారాన్ని మానుకోవాలంటూ మోడికి సవాలు విసిరారు.
అయితే మమత సవాలు చేసినపుడు మోడి, అమిత్ తరపునుండి ఎలాంటి జవాబు రాలేదు. పైగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలకనేతలు పాల్గొన్నారు కూడా. అయితే మమత సవాలు విసిరిన నాటినుండి చూస్తే ఈరోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో దేశం మొత్తంమీద రికార్డు స్ధాయిలో 3.15 లక్షల కేసులు నమోదయ్యాయి. దానికితోడు ఆక్సిజన్ నిల్వలు లేక రోగులు చనిపోవటం తదితరాలతో సుప్రింకోర్టు కూడా కేంద్రంపై బాగా మండిపోయింది.
కరోనాను ఎదుర్కోవటంలో కేంద్రం యాక్షన్ ప్లాను సబ్మిట్ చేయటానికి 24 గంటలు మాత్రమే గడువిచ్చింది. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో ముందుగా మోడి శుక్రవారం బెంగాల్ రోడ్డుషో ను రద్దు చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ఉదయం సమావేశం పెట్టారు. తర్వాత దేశంలోని పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమవుతున్నారు.
అంటే సుప్రింకోర్టు కలగజేసుకుని బాగా అక్షింతలు వేస్తేకానీ మోడికి తత్వం బోధపడలేదు. వ్యాక్సిన్ ఉత్పత్తి+సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి+సరఫరా, కేసుల నియంత్రణ తదితరాలపై ప్రతిపక్షాలు ఎంత గోలచేస్తున్నా మోడి అసలు లెక్కేచేయటంలేదు. అలాంటిది అర్జంటుగా సీఎంలతో సమావేశం, పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టడమంటే సుప్రింకోర్టు పుణ్యమనే చెప్పాలి. మొత్తానికి సుప్రింకోర్టు కొరడా ఝుళిపిస్తేకానీ మోడికి వాస్తవం బోధపడలేదు.