ష‌ర్మిల పార్టీకి అదే తొలి ఎన్నిక ?

ఏపీ సీఎం వైఎస్ . జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్‌. ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల త‌న కొత్త పార్టీ పేరు ఇంకా ప్ర‌క‌టించ‌కుండానే రాజ‌కీయంగా అనేక సంచ‌ల‌నాల‌కు ఆమె కేంద్ర బిందువు అయ్యింది. ష‌ర్మిల పార్టీపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అనేకానేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల ఖ‌మ్మం స‌భ‌లో ఆమె తన పార్టీ పేరు, జెండా అజెండాను వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటిస్తానని చెప్పారు. ఇక నిరుద్యోగుల కోసం ఆమె ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నారు. త‌న దీక్ష‌కు ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కోరుతూ లేఖలు కూడా రాశారు.

నిన్న‌టి వ‌ర‌కు అధికార టీఆర్ఎస్‌, బీజేపీల విష‌యంలో సైలెంట్‌గానే ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే విమ‌ర్శ‌ల వేడి పెంచుతున్నారు. ష‌ర్మిల వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాను ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాన‌ని కూడా చెప్పారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. పైగా రెడ్డి సామాజిక వ‌ర్గం జ‌నాభాతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్లు చాలా ఎక్కువ‌. పైగా తాను ఖ‌మ్మం కోడ‌లిని అని ష‌ర్మిల సెంటిమెంట్ బాగా పండించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా త‌న‌కు ఉమ్మ‌డం ఖ‌మ్మం జిల్లాలోనే ఎక్కువ బ‌లం ఉంద‌ని భావించిన ష‌ర్మిల త‌న పార్టీ పునాదికి ఖ‌మ్మం జిల్లానే కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తొలి ఎన్నిక‌ల‌ను కూడా ఖ‌మ్మం నుంచే ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ షర్మిల ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక్క‌డ త‌మ‌కు గ‌ట్టి ప‌ట్టు ఉంద‌ని భావిస్తోన్న ష‌ర్మిల పోటీ చేస్తే ముందుగా త‌న స‌త్తా ఏంటో ఫ్రూవ్ అవుతుంద‌ని… దానిని బ‌ట్టే వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు రెడీ కావొచ్చ‌న్న‌ది ఆమె ప్లాన్ అని స‌మాచారం.

గ‌తంలో ఖ‌మ్మం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా రెండు కార్పోరేట‌ర్ సీట్లు గెలిచింది. న‌గ‌రంలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువే. ఈ ఈక్వేష‌న్లు అన్ని బేస్ చేసుకునే ఇక్క‌డ పోటీకి ష‌ర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టే తెలుస్తోంది.