పవన్ జెండా ఎత్తేసినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చాటిచెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు భీమవరం అటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేశారు. అయితే జనాలు పవన్ను రెండు నియోజకవర్గాల్లోను తిరస్కరించారు. నామినేషన్ వేయటానికి ముందు చాలా పెద్ద కసరత్తులు చేసిన తర్వాతే పై రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు.

భీమవరం సంగతిని వదిలేసినా గాజువాకలో ప్రచారం చేసే సమయంలో పవన్ అక్కడి జనాలకు చాలా హామీలేఇచ్చారు. తాను గెలిచినా ఓడినా గాజువాకలోనే ఉంటానని, నియోజకవర్గం కేంద్రంలో పార్టీ కార్యాలయం కాకుండా తాను ప్రత్యేకంగా ఆఫీసు పెట్టుకుంటానన్నారు. రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటనలు చేయటం ద్వారా జనాలకు అందుబాటులో ఉంటానని ఇలా..చాలానే హామీలిచ్చారు.

ఇలాంటి హామీలు ఇవ్వటంలో ఉద్దేశ్యం ఏమిటంటే నామినేషన్ వేస్తే చాలా గెలిచేసినట్లే అన్న భావనతో. కానీ ఓడిపోవటంతో సీన్ రివర్సయ్యింది. అప్పటి నుండి పవన్ గాజువాక ప్రస్తావన తెస్తే ఒట్టు. ఏదైనా అవసరం నిమ్మిత పవన్ ఉత్తరాంధ్రకు లేదా ప్రత్యేకించి విశాఖపట్నం వెళ్ళినా గాజువాకలో మాత్రం అడుగుపెట్టడంలేదు. పార్టీ సమావేశాల్లో కూడా దాదాపు గాజువాక ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడుతున్నారట.

వీటన్నింటికి అదనంగా వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ అంశం రాజుకున్నదగ్గర నుండి గాజువాక ప్రస్తావననే పవన్ ఇష్టపడటం లేదని సమాచారం. మిత్రపక్షమైన బీజేపీ ఉక్కు ప్రైవేటీకరణకు చర్యలు తీసుకుంటున్న సమయంలో పవన్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించలేక, బహిరంగంగా మద్దతు పలకలేక నానా అవస్తలు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే గాజువాకలో పవన్ ఇక జెండా ఎత్తేసినట్లే అనే చర్చ పార్టీలోనే జోరుగా జరుగుతోంది.