బెంగాల్ పూర్తి.. పీకే తర్వాతి టార్గెట్ ఇదే

ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. తాను ఓకే చేసిన ప్రతి రాష్ట్రంలోనూ.. తన క్లయింట్లకు విజయాన్ని చేరువ చేసి.. అధికార దండం వారి చేతుల్లోకి వచ్చేలా చేయటంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రూటు సపరేటుగా చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కావొచ్చు.. బిహార్ కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఎక్కడైనా సరే.. తనను నమ్ముకొని తనను ఎన్నికల వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవటంతో పీకే ట్రాక్ రికార్డును ఏ మాత్రం వంక పెట్టలేం.

తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల్లో.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో డీఎంకే.. టీఎంసీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన.. ఆ పనిని పూర్తి చేశారు. ఇప్పటివరకు వెలువడుతున్న అంచనాల్ని చూస్తే.. రెండు రాష్ట్రాల్లో తాను సేవలు అందించిన పార్టీలే విజయం సాధిస్తాయని చెబుతున్నారు. మరి.. తర్వాతి పీకే తర్వాతి టార్గెట్ ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెలఖరులో బెంగాల్ చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే.. ఆయన పంజాబ్ కు వెళ్లనున్నారు. బెంగాల్ బాధ్యత పూర్తి అయిన వెంటనే.. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తిరిగి సీఎం పీఠం మీద కూర్చోబెట్టటమే పీకే లక్ష్యమని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా అమరీందర్ సింగ్ కు ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నియమితులయ్యారు. మే నుంచి పీకే సేవలు మొత్తం పంజాబ్ లోని కాంగ్రెస్ పార్టీకే అందించనున్నారు. ఆయన మేజిక్ రిపీట్ అయితే.. కాంగ్రెస్ కు కొత్త జోష్ ఖాయమని చెప్పక తప్పదు.