తిరుపత ఉప ఎన్నికల ప్రచారం మూడు తిట్లు.. ఆరు విమర్శలు అన్నట్లుగా సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మండిపడుతున్న పార్టీల ప్రచారం.. పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. తాజాగా టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన లోకేశ్ ప్రచారాన్ని నిర్వహించారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ.. జనసేన-బీజేపీల కూటమి తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
తాజాగా లోకేష్ జరిపిన ప్రచారంలో జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శల్ని సంధించారు. ఏపీని జేసీబీ ప్రభుత్వం పట్టిపీడుస్తోందన్న ఆయన.. జేసీబీ అంటే ఏమిటో చెప్పి అందరిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. జేసీబీ అంటే.. జగన్ టాక్స్.. కరప్షన్.. బాదుడు అంటూ సరికొత్త ఆర్థాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు.. ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉండి పార్లమెంటులో ఏం పీకుతున్నారు. అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపాలని.. పార్లమెంటులో ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఇదేనా ధర్మ పోరాటం అంటూ ప్రశ్నించిన లోకేశ్.. ఓపక్క ఆలీబాబా ఆయన దొంగలు.. మరోవైపు టీడీపీ వీరులు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజల కోసం పోరాడే టీడీపీ అభ్యర్థి పనబాక కావాలా? లేదంటే ముఖ్యమంత్రి జగన్ కాళ్లు నొక్కే మనిషి కావాలా? అని ఓటర్లను ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థిగా వ్యవహరిస్తున్న డాక్టర్ గురుమూర్తి ఫిజియో థెరపిస్టు అన్న విషయం తెలిసిందే.
తిరుపతి ఎంపీగా ఉన్న దివంగత నేత బల్లి దుర్గాప్రసాద్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్ వేధింపులకు గురి చేశారన్నారు. దళితుడనే కనీస గౌరవం కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిస్తే.. ఆయన బాగుపడటం తప్పించి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ విరుచుకుపడ్డారు.