రాహుల్ ఇక పప్పు కాదు..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి తగినట్లే.. మనుషుల అభిప్రాయాలు.. భావాలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరేళ్ల క్రితం రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చినంతనే.. యువరాజు.. పప్పు.. అమూల్ బేబీ లాంటి మాటలు వినిపించేవి. అప్రయత్నంగా పెదాల మీదకు చిన్న నవ్వు వచ్చేసేది. అయితే..ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గడిచిన కొంతకాలంగా తన మాటలతో.. చేతలతో ఆయన తన ఇమేజ్ ను తనకు తానే మార్చుకున్నారని చెప్పాలి.

ధనుష్కోటి దగ్గర సముద్రం మధ్యలో ఆయన చేసిన ఫీట్ ను ఎవరూ మర్చిపోలేరు. అంతేనా..? కేరళ..తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఆయన ప్రదర్శించిన ‘టాలెంట్’ ఇప్పుడాయన ఇమేజ్ ను మార్చటమే కాదు.. కొత్త లుక్ లో చూపిస్తోంది. గతంలో మాదిరి కాకుండా తాజాగా ఆయన మాటల్లో చురుకుదనం పెరగటమే కాదు.. ప్రత్యర్థుల మీద ఘాటు పంచ్ లు వేస్తున్నారు. మాటల్లోనూ.. చేతల్లోనూ పెద్ద ఎత్తున రాహుల్ లో మార్పులు వచ్చాయని చెప్పక తప్పదు.

ఈ వాదనలో నిజం ఎంతన్నది చెప్పేసేలా తాజాగా జరిగిన సేలం బహిరంగ సభ స్పష్టం చేసింది. ఇందులో మాట్లాడిన రాహుల్ గాంధీ..బీజేపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా.. మోహన్ భగవత్ లాంటి వ్యక్తుల కాళ్లు తాకటానికి ఏ తమిళుడూ ఇష్టపడడని.. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం వారి ముందు మోకరిల్లాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి పళనిస్వామికి ఇష్టం లేకున్నా.. సంఘ్ పరివార్.. అమిత్ షాలు సీబీఐ.. ఈడీల్ని ఉసిగొలిపి.. తమ కాళ్ల వద్దకు తెచ్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డరు.
పళని స్వామికి ఇష్టం లేకున్నా.. వారి ముందు సాగిలపడటానికి కారణం ఆయన చేసిన అవినీతేనని చెప్పారు.

తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ అని తాను గ్యారెంటీ ఇస్తున్నట్లు చెప్పారు. నిజానికి ఆయన ఎన్నికల లాంఛనమేనని.. అయినప్పటికి ఎన్నికల ప్రక్రియ ఉందని.. దాన్ని అంత సులువుగా తీసుకోకూడదన్నారు. సంఘ్ పరివార్.. బీజేపీల వద్ద అపరిమితమైన డబ్బు ఉందని.. అందుకే జాగ్రత్తగా ఉండాలన్నారు. తొలుత తమిళనాడు నుంచి తరిమికొడదామని.. తర్వాత ఢిల్లీ నుంచి పంపించేద్దామని వ్యాఖ్యానించారు. రాహుల్ మాటల్లో పదును.. అంతే చురుకు ఎక్కువైందని చెప్పక తప్పదు.