తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఎట్టకేలకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి… రత్నప్రభ.. అత్యంత కీలక సమయంలో కర్ణాటకలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.. అవినీతి రహితంగా వ్యవహరించి.. తన సర్వీసులో మంచి రికార్డును కూడా నెలకొల్పారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. అయితే.. దీని వెనుక.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నికలో టికెట్ కోసం.. జనసేనాని తీవ్రంగా శ్రమించారు. అయితే.. బీజేపీ పెద్దలు నచ్చజెప్పడంతో ఆయన పక్కకు తప్పుకొన్నారు.
వాస్తవానికి జనసేన ఇక్కడ పోటీ చేసి ఉన్నా.. రత్నప్రభకే టికెట్ ఇచ్చేవారనేది వాస్తవం. గత కొన్నాళ్లుగా జనసేనాని పవన్.. ఆమెతో టచ్‌లో ఉన్నారు. ఏపీకి చెందిన రత్న ప్రభను పార్టీలో చేర్చుకునేందుకు కూడా కొన్నాళ్ల కిందటే ప్రయత్నించారు. అయితే.. అప్పట్లో మౌనం వహించిన ఆమె ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.. ఎలాగూ పవన్‌కు టికెట్ ఇవ్వలేదు కనుక.. ఆయన సూచించిన వ్యక్తికి ఇచ్చి.. సంతృప్తి పరచాలనే వ్యూహంతో బీజేపీ కేంద్ర నాయకత్వం.. రత్న ప్రభకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. సరే.. మొత్తానికి బీజేపీ అయితే… మంచి
అభ్యర్థికే అవకాశం ఇచ్చింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ పుంజుకుని.. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం అనేది ప్రశ్నగానే మారింది.
రాష్ట్రంలో రెండేళ్ల పాలన తర్వాత.. జగన్‌పై వ్యతిరేకత కంటే.. కూడా కేంద్రంపైనే ఎక్కువగా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్రస్తుతం విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తామని తెగించి చెప్పడం.. ఎక్కడ ఏం జరిగినా.. మోడీ ఉన్నారనే ప్రచారాన్ని జనాలు విస్తృతంగా నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇది ఇటీవల జరిగిన స్థానిక, పంచాయతీ, కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తిరుపతిలో గెలుపు గుర్రం ఎక్కడం అంటే.. మాత్రం కష్టమే. అయితే.. రత్న ప్రభ ఆమాత్రం ముందుచూపు
లేకుండా ఇక్కడ అడుగు పెట్టారా? అంటే.. సందేహమే. దాదాపు 40 ఏళ్ల ఐఏఎస్ కెరీర్లో ఇలాంటి అనేక పరిణామాలను గమనించిన ఆమె.. బీజేపీ నుంచి గట్టి హామీ
పొందాకే.. తిరుపతిలో ప్రత్యక్షం అవుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి టికెట్ ఇప్పించుకోవడంలో జనసేన సక్సెస్ అయింది. మరి గెలిపించుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో!!