తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదంటూ ఐదేళ్ల ముందు వరకు బల్లగుద్ది చెబుతూ వచ్చాడు కమల్ హాసన్. కానీ జయలలిత మరణించగానే ఆయనకు రాజకీయాలపై ఆశ పుట్టింది. కరుణానిధి కూడా మంచం పట్టడంతో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేద్దామని, అధికారం చేపడదామని ఆశతో రాజకీయాల్లో అడుగు పెట్టాడు కమల్. ఐతే నూతన రాజకీయాలకు శ్రీకారం చుడతానని.. సంప్రదాయ పార్టీల తరహాలో తన పార్టీ ఉండదని ఢంకా బజాయించిన కమల్.. చివరికి తాను ఎవరికీ భిన్నం కాదని, సగటు రాజకీయ నాయకుల్లో ఒకడినే అని తన చర్యలతో చాటిచెబుతూ వచ్చాడు. భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీ అంటూ కమల్ ఎంతగా వ్యతిరేకిస్తాడో తెలిసిందే. అలాంటి ఆయన ఎంఐఎం తరహాలో తమిళనాట కరడు గట్టిన ముస్లిం మత తత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడం గమనార్హం.
తమిళనాట ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల హామీల గురించి జాతీయ స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. వాషింగ్ మెషీన్లిస్తాం.. కేబుల్ టీవీ సమకూరుస్తాం.. అంటూ ఆశ చూపుతున్నాయి ప్రధాన పార్టీలు. కమల్ పార్టీ ఇందుకు భిన్నమేమీ కాదని తాజాగా విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. మక్కల్ నీదిమయం ఎన్నికల హామీల్లో భాగంగా గృహిణులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లిస్తామని కమల్ ప్రకటించారు. గృహిణులకు జీతం అంటూ కొన్ని నెలల కిందటే ఆయన ఒక చర్చా కార్యక్రమంలో దీని గురించి సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు దానిపై ప్రకటన చేశారు. ఐతే తాము ఇచ్చేది ఉచిత తాయిలం కాదని, ఇంట్లో వారి చేసే పనికి గౌరవ వేతనం అని కమల్ అంటున్నారు. ఎలా ఇచ్చినా కూడా ఇది మహిళలను ఆకర్షించే ఒక తాయిలమే అనడంలో సందేహం ఏముంది? అలాగే 75 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.5 వేల చొప్పున పింఛను ఇస్తామని కమల్ పెద్ద హామీనే ఇచ్చాడు. విద్యార్థులకు స్మార్ట్ ట్యాబ్లు ఇస్తాం, కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు బైక్లు కొనేందుకు వడ్డీ లేని రుణాలు.. ఇలాంటి జనాకర్షక హామీలతో కమల్ తాను కూడా సంప్రదాయ రాజకీయ నాయకుల్లో ఒకడినే అని చెప్పకనే చెప్పారు కమల్.
Gulte Telugu Telugu Political and Movie News Updates