జగన్ కేబినెట్‌లోకి ఫైర్ బ్రాండ్ రోజా రానున్నారా ? తనకు ఇప్పుడున్న ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఆమె ఇష్టం లేకుండానే భరిస్తున్నారా? దీనిని వదులుకుని.. తను మంత్రి వర్గంలో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు, సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న గుసగుస వంటివి ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి 2019లో జగన్ సర్కారు ఏర్పాటు అయినప్పుడే.. రోజాకు మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. అప్పట్లో చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చిన జగన్ ఒకే సామాజిక వర్గం కావడంతో రోజాను పక్కన పెట్టారు.
ఈ క్రమంలోనే రోజాను గుర్తిస్తూ.. ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవిని అప్పగించారు. అయితే.. ఆమె ఇష్టం లేక పోయినా జగన్ ఇవ్వడంతో తీసుకున్నారు. అయినప్పటికీ.. ఆమె మనసు పెట్టి ఏపీఐఐసీలో పనిచేసింది లేదు. ఏదో ముక్తసరిగా మీటింగులకు హాజరవడం.. అటెండెన్స్ వేయించుకునేందుకే పరిమితమయ్యారు. రెండు కీలక పదవుల్లో ఉండి కూడా ఆమె టీవీ షోలు మానలేదు. ఈ క్రమంలో తనను తాను నిరూపించుకుని.. జగన్ దగ్గర మార్కులు సంపాయించుకునేందుకు ఇటీవల జరిగిన నగరి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనధికార వర్గాల కథనం మేరకు దాదాపు రు. 5 కోట్ల రూపాయల వరకు ఇక్కడ రోజా ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఆమె నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు, నగరి రెండు మున్సిపాల్టీలను ఆమె సొంతం చేసుకున్నారు.
పార్టీలో తనకున్న వ్యతిరేకతను కూడా అధిగమించిన రోజా.. ప్రజలు తనవైపే ఉన్నారని నిరూపించుకు న్నారు. ఈ క్రమంలో తన మనసులో ని కేబినెట్ ఆశలను జగన్‌తో చెప్పుకొనేందుకు హుటాహుటిన ఆమె తాడేపల్లికి చేరుకున్నారు. పైకి మాత్రం జగన్‌ను అభినందించేందుకు వచ్చారని ప్రచారం సాగుతున్నా.. సీనియర్ నాయకులు మాత్రం రోజా.. గట్టి ప్రతిపాదనతోనే వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా సాగుతుండడం గమనార్హం.
అయితే.. ఇప్పటికే ఉన్న పెద్దిరెడ్డి.. రోజాకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు జగన్ అవకాశం ఇస్తారా ? అనేది కీలక ప్రశ్న. ఎవరి మంత్రి పదవి ఉన్నా పోయినా పెద్దిరెడ్డికి డోకా లేదు. అదే సమయంలో రోజా వంటి నాయకురాలికి అవకాశం ఇవ్వకపోతే.. మహిళల్లో ఎలాంటి సంకేతాలు వస్తాయనేది మరో ప్రశ్న. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.