ప్రస్తుతం ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. అన్ని పార్టీలూ సర్వ శక్తులూ వడ్డుతున్నాయి. ఈ ఎన్నికలను పార్టీలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడతాయని ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను పార్టీలవైపు ఆకర్షించేందుకు, స్థానికంగా అభిమానం ఉన్న వారిని తమవైపు తిప్పుకొన్నేందుకు ఈ ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, కమ్యూనిస్టులు, బీజేపీ పార్టీల నుంచి అగ్రనాయకులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు.
అయితే.. పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేస్తానని, బలోపేతం చేస్తానని, యువతను ఆకర్షిస్తానని చెబుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారానికి కార్యరంగంలోకి దూకలేదు. వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించి.. విశాఖను టార్గెట్ చేసుకుందామని భావించారు. అయితే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో చిక్కులు వస్తాయని అనుకున్నారో.. ఏమో.. మౌనం వహించారు. పోనీ.. దానిని పక్కన పెట్టినా.. విజయవాడ.. గుంటూరు వంటి కీలకనగరాల్లో అయినా పార్టీని పరుగులు పెట్టించే ప్రయత్నం చేయాలని పార్టీలోని కొందరు కీలక యువ నాయకులు పవన్‌కు ప్రెపోజ్ చేశారు.. అయితే.. ఆయన ఎన్నికలకు ముందు వస్తానని చెప్పినా.. ఇప్పటి వరకు రాలేదు.
మరో రెండు రోజుల్లోనే ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేస్తున్న వార్డుల్లో పార్టీ యువ నాయకులే.. అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇక, జనసేన తరఫున పోటీ చేస్తున్న అబ్యర్థులు.. వాహనాలను సమకూర్చుకుని.. పవన్ ఆడియో.. వీడియోలను ప్లే చేస్తూ.. ప్రజలను ఓట్లు అబ్యర్థిస్తున్నారు. అయితే.. ప్రత్యక్షంగా ఒక్క సారైనా.. పవన్ సుడిగాలి పర్యటన చేయాలని.. అలా అయితే.. మంచి ప్రభావం కనిపిస్తుందని.. నాయకులు భావిస్తున్నారు.
ఇక, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అయినా.. ప్రజల్లోకి వస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఆయన కూడా కేవలం ప్రకటనలకు, సందేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మరి ఇంత కీలక సమయంలో టీడీపీ తరఫున చంద్రబాబు నేరుగా ప్రచారం చేస్తుండడం.. వైసీపీ తరఫున కీలక మంత్రులు రంగంలోకి దిగడం వంటివి చూస్తున్నప్పుడైనా.. జనసేనాని తన ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా? అనే విశ్లేషణలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates