జనసేనాని పవన్ కళ్యాణ్.. అధికార పార్టీ వైసీపీపై పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఓటేయొద్దంటూ పిలుపునిచ్చారు. వాస్తవానికి గత ఎన్నికల తర్వాత ఆయన పెద్దగా ఏపీపై దృష్టి సారించింది లేదు. అడపా దడపా.. ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇక, పంచాయతీ ఎన్నికల సమయంలో మాత్రం తనదైన శైలిలో వ్యవహరించారు. యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టాలని అధికారులకు విన్నవించారు. ప్రజలే తిరగబడాలని పిలుపునిచ్చారు.
అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా పవన్.. వైసీపీపై నిప్పులు చెరిగారు. ఏపీలో హిట్లర్ పాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. అయితే.. హిట్లర్ ను చూసిన ప్రపంచం ముందు మీరెంత మీ బ్రతుకులెంత.. అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని.. ప్రజలు తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇక, అధికార యంత్రాంగం కూడా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ఇది అధికారుల నైతిక బాధ్యతగా పవన్ పేర్కొన్నారు. కుల రాజకీయాలతో అంటకాగొద్దని అధికారులకు పిలుపునిచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల జనసేన గెలుపొందిందని… ఇప్పుడు కూడా అదే స్థాయిలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలుపు గుర్రం ఎక్కుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీకి మాత్రం ఓటేయొద్దని పవన్ ప్రజలకు సూచించారు. వైసీపీ వారికి ఓటేస్తే యాచించే స్థాయికి తెస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పంచాయితీ ఎన్నికల కంటే 10 రెట్లు దాష్టీకానికి మున్సిపల్ ఎన్నికల్లో పాల్పడిందని.. ఎక్కడికక్కడ బెదిరింపులు, దౌర్జన్యాలను ప్రజలు చూస్తున్నారని.. అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలే వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే.. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను పవన్ సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి పవన్ పిలుపు ఏమేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates