మొత్తానికి అనేక వివాదాల తర్వాత విజయవాడ ఎంపి కేశినేని నాని తన పంతాన్ని నెగ్గించుకున్నారు. విజయవాడ ఎంపి కూతురు శ్వేతను తెలుగుదేశం పార్టీ తరపున మేయర్ అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటింపచేయాలని ఎంపి గట్టిగానే ప్రయత్నించారు. ఇదే సమయంలో శ్వేతను కాకుండా ఇతర సామాజికవర్గాలకు చెందిన వారిని ప్రకటించాలని ఇతర నేతలు గట్టిగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ నేపధ్యంలోనే ఎంపికి మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ నాగూల్ మీరా లాంటి నేతల మధ్య అనేక వివాదాలు రోడ్డున పడ్డాయి. వీళ్ళ వివాదంలో చివరకు చంద్రబాబు పేరును కూడా రోడ్డుమీదకు లాగిన విషయం గుర్తుండే ఉంటుంది. వివాదాలు ముదిరిపోయి నేతల గొడవలతో రోడ్డున పడిన తర్వాత కానీ చంద్రబాబు మేల్కోలేదు. నేతలందరినీ పిలిచి మాట్లాడి చంద్రబాబు ఫుల్లుగా క్లాసు పీకారు.
ఒకవైపు ఇది జరుగుతుండగానే గుంటూరు మేయర్ అభ్యర్దిగా కోవెలమూడి రవీంద్రను పార్టీ అధికారికంగా ప్రకటించింది. గుంటూరు మేయర్ గా కమ్మ సామాజికవర్గం నేతను ప్రకటించిన కారణంగా విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ఇతర సామాజికవర్గాల పేరును ప్రకటిస్తారని అందరు అనుకున్నారు. ఇదే విషయమై ఎంపికి చంద్రబాబు చెక్ చెప్పారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. దాంతో ఎంపిలో తీవ్ర అసహనం మొదలైపోయింది.
అయితే తెరవెనుక ఏమి జరిగిందో కానీ గురువారం రాత్రి హఠాత్తుగా ఎంపి కూతురు శ్వేతను మేయర్ అభ్యర్ధిగా పార్టీ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఎంపి వ్యతిరేకులందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. ఎలాగూ ఎంపి కూతురుని మేయర్ అభ్యర్ధిగా ప్రకటించేది లేదన్న ధీమాతో నేతలు ఎవరికి వారుగా తమ అభ్యర్ధిని చంద్రబాబు ముందు ప్రతిపాదించారట. అయితే చివరకు చంద్రబాబు ఎంపి కూతురు శ్వేత అభ్యర్ధిత్వంవైపే మొగ్గారు. మరి శ్వేత ప్రకటన తర్వాత పార్టీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే విషయం ఆసక్తిగా మారింది.