సోషల్ మీడియా పైనే ఆశలు పెట్టుకున్నారా ?

చంద్రబాబునాయుడు తాజాగా నిర్వహించిన సమావేశం చూస్తుంటే అలాగే ఉంది. టీడీపీ అభిమానులు, మద్దతుదారులైన యువతతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో అత్యధికులు టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారే కావటం గమనార్హం. కుప్పంలో వీరితో భేటీ అయినపుడు అధికార పార్టీ ఆగడాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగే ప్రతిచోటా టీడీపీ సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్ గా ఉండాలని చెప్పారు.

ఎన్నికల్లో అధికారపార్ట అక్రమాలు, అభ్యర్ధుల ప్రచారంలో ఉల్లంఘించే నిబంధనలను, అధికారపార్టీతో అధికారుల కుమ్మక్కు తదితరాలను సోషల్ మీడియాలో చూపించటం ద్వారా జనాల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. చంద్రబాబు తాజా ఆదేశాలను గమనిస్తే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాపైన పెద్ద బాధ్యతే పెట్టినట్లున్నారు.

మామూలుగానే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పార్టీ నేతలు, శ్రేణుల ప్రచారం కన్నా సోషల్ మీడియా చేస ప్రచారమే ఎన్నోరెట్లు అధికంగా ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావటానికి పార్టీ సోషల్ మీడియా విభాగం చాలా కీలకపాత్ర పోషించింది. అలాంటి వింగ్ వివిధ కారణాల వల్ల 2019 ఎన్నికల్లో చతికలపడింది.

ఇదే సమయంలో వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియా వింగ్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జనాల్లో బాగా చొచ్చుకుపోయింది. దీని ఫలితంగా జనాల్లో జగన్ అంటే సానుకూలత ఏర్పడింది. చంద్రబాబు వైఫల్యాలు, జగన్ పాదయాత్ర, హామీలు తదితరాలు కలిసివచ్చి వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటి వచ్చింది. చంద్రబాబు కూడా ఎందుకనో మొన్నటి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను పట్టించుకున్నట్లు లేరు. అలాంటిది తాజాగా మళ్ళీ సోషల్ మీడియాపై పెద్ద దృష్టి పెట్టారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూద్దాం.