కుప్పంలో జై జూనియర్ ఎన్టీయార్

చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో విచిత్రమైన పరిస్దితిలు కనిపించాయి. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి దెబ్బకు చంద్రబాబు మూడు రోజుల కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. శుక్రవారం చివరిరోజు పర్యటనలో ఉండగా రామకుప్పం, రాజుపేట మండలాల్లో జరిగిన రోడ్డుషోల్లో ఒక్కసారిగా జై జూనియర్ ఎన్టీయార్ అంటు అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. తెలుగుదేశంపార్టీకి సంబంధించి కుప్పంలో ఎప్పుడు కూడా అసలు ఎన్టీయార్ కుటుంబం ఊసే ఉండేది కాదు.

చంద్రబాబు పర్యటనలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా చంద్రబాబుతో పాటు లోకేష్, బాలకృష్ణ, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ తో పాటు స్ధానిక నేతల ఫొటోలు మాత్రమే ఉండేది. జిందాబాదులు కొట్టేవాళ్ళు కూడా చంద్రబాబు, లోకేష్ పేర్లు మాత్రమే ప్రస్తావించేవారు. గడచిన 35 ఏళ్ళుగా కుప్పంలో ఇదే పద్దతి నడుస్తోంది. కానీ తాజాగా చంద్రబాబు పర్యటనలో మాత్రం అందుకు బిన్నంగా జరగటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

చంద్రబాబు రోడ్డుషో నిర్వహిస్తున్నపుడు అభిమానులు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీయార్ ను రంగంలోకి దించాలని, ప్రచారంలోకి తీసుకురావాలంటు పదే పదే గట్టిగా నినాదాలిచ్చారు. ఇదే సమయంలో లోకేష్ గురించి ఎవరు ఎక్కడా ప్రస్తావన కూడా తేలేదు. దాంతో చంద్రబాబులో తీవ్ర అసహనం కనబడింది. కార్యకర్తలు, అభిమానుల డిమాండ్ కు ఏమి సమాధానం చెప్పాలో తెలీక మాట్లాడకుండా కేవలం తలఊపటంతోనే సరిపెట్టారు.

తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చాలా ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీయార్ ఫొటో కూడా కనబడింది. దాంతో చంద్రబాబులో మరింత అసహనం కనబడింది. పంచాయితి ఎన్నికల్లో ఓటమి దెబ్బకు చంద్రబాబు సమక్షంలోనే లోకేష్ ను కాదని జూనియర్ ఎన్టీయార్ కు మద్దతుగా కార్యకర్తలు జిందాబాద్ లు కొట్టడం, ప్రచారంలోకి వెంటనే రంగంలోకి దించాలని డిమాండ్లు చేయటం ఇంట్రస్టింగ్ పాయింటే. అయితే జూనియర్ ను టీడీపీ దరిదాపుల్లోకి చంద్రబాబు రానిస్తారా ?