రాజస్థాన్ బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. దీంతో.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోఈ అంశంపై సంచలనంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటంపై పెద్ద ఎత్తున విషాదం వ్యక్తమవుతోంది.
ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు.. మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన ఒకరి మరణం.. వారి కుటుంబాన్ని తీవ్రమైన డిప్రెషన్ కు గురయ్యేలా చేసిందని.. ఈ కారణంతోనే వారు సూసైడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో మదన్ లాల్ సైనీ సోదరుడు హనుమాన్ ప్రసాద్ కుమారుడు మరణించారు. దీంతో.. వారి కుటుంబం తీవ్రమైన మానసిక వ్యధకు లోనైనట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తామంతా ఊరి వేసుకొని మరణించినట్లుగా హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ లేఖలో ఉంది. ఇక.. తాజాగా ఆత్మహత్య చేసుకున్న వారిలో సోదరుడు హనుమాన్ ప్రసాద్ సైనీ.. మదన్ లాల్ భార్య తారా.. వారి ఇద్దరు కుమార్తెలు అంజు.. పూజాలు ఉన్నారు. తన పెద్ద కుమారుడు మరణించిన తర్వాత తనకు బతకాలన్న ఆశ లేదంటూ హనుమాన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు రాజస్థాన్ లో సంచలనంగా మారింది.