దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురిగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా షర్మిలకు కొత్తగా పరిచయం అవసరం లేదు. యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆమె దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ను జైలులో పెట్టినపుడు అన్న కోసమని రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర అప్పటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణాలో జిల్లాల్లో కూడా జరిగింది.
ఇప్పుడిదంతా చెప్పుకోవటం ఎందుకంటే కొద్దిరోజులుగా షర్మిల కొత్త రాజకీయపార్టీ పెట్టబోతున్నారంటు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లోటస్ పాండ్ లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ అభిమానులతో, మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు అవుతుండటమే అందరిలోను ఆసక్తి రేపుతోంది. మొదటగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశం అవుతారట. రెండు రోజులకు ఒక జిల్లాలోని ముఖ్యులతో సమావేశం అవ్వబోతున్నారట షర్మిల.
షర్మిల ఆధ్వర్యంలో తెలంగాణాలో సమావేశాలు అనగానే ఒక్కసారిగా అన్నీ పార్టీల నేతల దృష్టి లోటస్ పాండ్ వైపు మళ్ళింది. వైఎస్సార్ కు తెలంగాణాలో బలమైన మద్దతుదారులుండేవారు. కొండా సురేఖ దంపతులు, సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇంద్రకరణ్ రెడ్డి, దానం నాగేందర్, సురేష్ రెడ్డి, షబ్బీర్ ఆలీ అహ్మద్ లాంటి అనేక వందలమందున్నారు. ఇటువంటి అభిమానులు, మద్దతుదారుల వల్లే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఖమ్మం జిల్లాలో ఒక ఎంపి, ముగ్గురు ఎంఎల్ఏలు గెలిచారు.
సో ఇటువంటి నేపధ్యంలో షర్మిల తెలంగాణాలో కొత్తపార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం బాగా ఆసక్తిని కలిగిస్తోంది. నిజానికి టీఆర్ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ చీలికలు పీలికలైపోయాయి. బీజేపీ ఒక్కటే గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంచేస్తోంది. ఈ సమయంలో తెలంగాణాలో రాజకీయంగా శూన్యత ఉందని బహుశా షర్మిల భావించినట్లున్నారు. పార్టీ పెడతారో లేదో తెలీదు కానీ రెండు రోజుల క్రితం కేసీయార్ పార్టీ సమావేశంలో మాట్లాడుతు కొత్తపార్టీ పెట్టడమంటే మాటలు కాదు అని చేసిన వ్యాఖ్యలతో షర్మిల సమావేశానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.