విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటును రక్షించుకునేందుకు మరో ఉద్యమం తప్పేట్లు లేదు. విచిత్రమేమంటే అప్పట్లో స్టీల్ ప్లాంట్ సాధనకూ ఉద్యమం చేయాల్సొచ్చింది. ఇపుడు కాపాడుకోవటానికీ ఉద్యమాలు మొదలవుతున్నాయి. విశాఖ స్టీలుకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. స్టీలు ఫ్యాక్టరీలో వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రైడ్ ఆఫ్ ఏపిగా నిలిచిన విశాఖ స్టీల ఫ్యాక్టరికి అన్యాయం చేసింది కేంద్రప్రభుత్వమనే చెప్పాలి.
బహుశా లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తు కూడా సొంతంగా ఇనుపగనులు లేని ఏకైక ఫ్యాక్టరీ విశాఖ స్టీల్సే నేమో. తమకు సొంతంగా గనులు లేనికారణంగా ఆర్ధికభారం పెరిగిపోతోందని, నష్టాలు పెరిగిపోతున్నాయని యాజమాన్యం సంవత్సరాలుగా కేంద్రంతో మొత్తుకుంటోంది. అయినా కారణాలు తెలీదు కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి గనులను మాత్రం కేటాయించేందుకు కేంద్రం ఇష్టపడటం లేదు. దాంతో ముడిసరుకు కొనుగోలుకే ఏడాదికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సొస్తోంది. స్టీలు ఫ్యాక్టరీ నష్టాలకు ఇది కూడా ప్రధాన కారణం.
ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా విశాఖ స్టీల్స్ లోని తన వాటాను వాపసు తీసేసుకుని ప్రైవేటు పరం చేయాలని డిసైడ్ చేసింది కేంద్రం. దాంతో ఉద్యోగ, కార్మికసంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం ఉదయం నుండి ఆందోళనలు మొదలయ్యాయి. వీళ్ళ ఆందోళనల్లో వైసీపీ ఎంఎల్ఏ నాగిరెడ్డి, విశాఖ, అనకాపల్లి ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామంటూ నేతలు గట్టిగా నినదించారు.
కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే మామూలు జనాల ఘోషను పట్టించుకునే స్ధితిలో లేదు. దాదాపు రెండున్నర నెలలుగా జరుగుతున్న రైతుసంఘాల ఉద్యమాన్నే ఇఫ్పటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పట్టించుకోలేదు. అందుకనే ఆ ఉద్యమం పెరిగిపెరిగి ఇపుడు అంతర్జాతీయస్ధాయికి చేరుకున్నది. అలాగే విశాఖ స్టీలు ఫ్యాక్టరిని ప్రైవేటుకు అప్పగించేందుకు మొదలైన ప్రయత్నాలు కూడా ఉద్యమరూపం సంతరించుకోవాల్సిందే అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరి తాజా ఆందోళనపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.