ప్రభుత్వానికి-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నా యి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం సహకరిస్తున్నా.. నాయకుల దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ.. నిమ్మగడ్డపై కులం, వర్గం.. పేరిట.. తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులు దూషణలకు దిగుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వాటిపై తాను మరోసారి కోర్టు కు వెళ్తానని నిమ్మగడ్డ స్పష్టంచేసినప్పటికీ.. వైసీపీ నాయకులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల నిమిత్తం వెళ్లిన సాయిరెడ్డి.. అక్కడి పనులు చూసుకోవడం మానేసి.. ఏపీ ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేసే అజెండాను ఎంచుకున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మెంటల్ వచ్చిందని.. ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించా లని సాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. వైద్యులకు రిఫర్ చేయాలని కూడా సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, నిమ్మగడ్డను చంద్రముఖిలాగా చంద్రబాబు ఆత్మ పూనిందని.. శరీరం మాత్రమే నిమ్మగడ్డదని, నడిపిస్తోందంతా.. చంద్రముఖేనని అన్నారు. అందుకే చంద్రబాబు చెప్పినదానికి తందాన అంటున్నారు అని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ ఇష్టానుసారంగా అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని, నిమ్మగడ్డను రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టడమే తప్పని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ప్రవచనాలు చెప్పడంలో చాగంటి, గరికపాటిని మించిపోయారని విమర్శించారు. మొత్తానికి నిమ్మగడ్డపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. అయితే.. వీటిపై నిమ్మగడ్డ అంతే రేంజ్లో రియాక్ట్ అవడం గమనార్హం. తాను రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నానని.. తనపై విమర్శలు చేయడం తగదని.. గతంలోనే ఆయన హెచ్చరించారు. అయితే.. సాయిరెడ్డి మాత్రం దూకుడు తగ్గించకపోవడంతో దీనిపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ.. త్వరలోనే కోర్టుకు వెళ్లే యోజనలో ఉన్నారని సమాచారం. ఏదేమైనా.. నిమ్మగడ్డ వంటి రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న ఆయనను ఇలా హీనంగా మాట్లాడడం సరికాదని ప్రజాస్వామ్య వాదులు సైతం సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates