రామతీర్థ పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనలో A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా కళా వెంకట్రావు పేర్లను పోలీసులు చేర్చడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు, ఈ ఘటనకు సంబంధించి మరో 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు చేర్చారు. కాగా, బుధవారం నాడు కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియోగంపై కళా వెంకట్రావును అరెస్టు చేశారు. రాజాం పట్టణంలోకి బుధవారం రాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వచ్చి కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని సమీపంలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కళా వెంకట్రావు అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతోపాటు రామతీర్ధంలో శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ క్రమంలోనే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్థ పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డికి ఆలయ గర్భగుడిలో పూజలు చేసేందుకు అనుమతిచ్చిన అధికారులు….చంద్రబాబుకు అనుమతివ్వకలేదు. చంద్రబాబు పర్యటనకు వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రామతీర్థ పర్యటనలో విజయసాయి రెడ్డి వాహనం మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత కళా వెంకట్రావును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం,నోటీసులివ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates