పాలిటిక్స్‌లోకి వివేకా కుమార్తె.. మొగ్గు ఎటు!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజమేన‌ని అంటున్నారు క‌డ‌ప జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. ప్ర‌ముఖ వైద్యురాలు.. సునీత‌.. త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అయితే..పార్టీ ఏద‌నే విష‌యంలో ఒకింత త‌ర్జ‌న భ‌ర్జన ఉన్న‌ప్ప‌టికీ.. జాతీయ పార్టీలోకి వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. త‌న తండ్రి హ‌త్య‌కు సంబంధించి.. తీవ్రంగా మ‌ధ‌న ప‌డుతున్న సునీత‌.. రాష్ట్రంలో ఏర్ప‌డిన త‌న అన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు.

ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌న తండ్రి హ‌త్య‌కు వెనకున్న కార‌ణాలు తెలుస్తాయ‌ని.. ఖ‌చ్చితంగా నేర‌స్తులు జైలుకు వెళ్తార‌ని ఆమె భావించారు. కానీ, ఆమె అనుకున్న విధంగా అన్న ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం లేదు. గ‌తంలో విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఇదే హ‌త్య‌పై ఒక డిమాండ్ చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వాత తూచ్‌. అన‌డం.. సునీతను తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే త‌ల్లీ కుమార్తెలు హైకోర్టుకు వెళ్లి సీబీఐ కోసం డిమాండ్ చేయ‌డం తెలిసిందే. అయితే.. ఇప్పుడు సీబీఐని కూడా మేనేజ్ చేస్తున్నార‌నేది.. సునీత అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే ఏ రాజ‌కీయాల కార‌ణంగా త‌న తండ్రిని పొట్ట‌న పెట్టుకున్నారో.. అదే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జల మ‌ద్ద‌తుతో.. త‌న తండ్రి కేసు వెనుక ఉన్న వారిని బ‌య‌ట‌కు లాగాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్పటికే ఢిల్లీలోని రాజ‌కీయ పెద్ద‌ల(బీజేపీ వార‌ని స‌మాచారం) ను సునీత క‌లిసిన‌ట్టు స‌మాచారం. క‌డ‌ప‌లో గ‌ట్టి ప‌ట్టున్న వైఎస్ వివేకానంద‌రెడ్డి.. గ‌తంలో ఎంపీగా విజ‌యం సాధించారు. జ‌గ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయ‌న త‌ప్పుకొన్నారు.

ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గంలో సునీత పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. సునీత‌పై సానుభూతితోపాటు.. వివేకాపై అభిమానం రెండూ కూడా సునీత విజ‌యానికి కార‌ణ‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. త‌న తండ్రి హ‌త్య‌కేసును ఛేదించాల‌నేది సునీత డిమాండ్‌గా వినిపిస్తోంది. మొత్తానికి సునీత పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.