రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలోని పలాస నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఈ నియోజకవర్గంలో పురుషులు గెలుస్తారు.. కానీ, చక్రం తిప్పేది మాత్రం మహిళలే! అనే వాదన ఉంది. పైకి జరుగుతున్న పరిణామాలు కూడా దీనిని ఔననే అంటున్నాయి. విషయంలోకి వెళ్తే.. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు విజయం సాధించారు. సరే.. కొన్నాళ్లకు ఈయనకు జగన్ బీసీ కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నియోజకవర్గంలో మాత్రం సీదిరి సతీమణి.. శ్రీదేవి చక్రం తిప్పుతున్నారు.
గత ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు శ్రీదేవి ముందుకు కదిలారు. అప్ప లరాజు.. మత్స్యకార సామాజిక వర్గమే అయినా.. శ్రీదేవి కాళింగ వర్గానికి చెందిన ఆడపడుచు కావడంతో ఎందుకైనా మంచిదని.. అన్నివర్గాల ఓట్లను సమీకరించేందుకు శ్రీదేవి కూడా దూకుడుగా వ్యవహరించి పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి.. ఎన్నికల ప్రచారం చేశారు.
ఇక, ఇప్పుడు అప్పలరాజు మంత్రి కావడం తో నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అధికార, అనధికార కార్యక్రమాలకు శ్రీదేవి హాజరవుతున్నారు. చిన్నపాటి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. దీంతో మంత్రిగారి సతీమణి దూకుడుపై చర్చ జరుగుతోంది.
అయితే.. ఈ నియోజకవర్గంలో కేవలం ఇప్పుడు మాత్రమే.. ఇలా జరగడం లేదని అంటున్నారు పరిశీల కులు. గతంలో టీడీపీ తరఫున గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ విజయం సాధించారు. అయితే.. 2014-19 వరకు నియోజకవర్గంలో ఆయన కుమార్తె, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు.. గౌతు శిరీష.. అన్నీ తానై చక్రం తిప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల నుంచి పార్టీ తరఫున జరగాల్సిన కార్యక్రమాల వరకు కూడా అన్నీ శిరీషే చూసుకునేవారు. ఇక, ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకొనేందుకు శిరీషనే కన్సల్ట్ చేసేవారు.
సో.. పలాసలో పురుష అభ్యర్థులు గెలిచినా.. మహిళా నేతలే చక్రం తిప్పుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ గౌతు ఫ్యామిలీకి.. సీదిరి ఫ్యామిలీకీ కొంత తేడా ఉంది. గౌతు శిరీష చక్రం తిప్పినా.. ఆమె టీడీపీ కీలక నేతగా ఉన్నారు. కానీ, మంత్రి సతీమణి.. శ్రీదేవి మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు. సో.. ఈ తేడా ఒక్కటే చర్చనీయాంశంగా మారింది.
Click Here for Recommended Movies on OTT (List Updates Daily)