అభిమానుల తీరుపై రజినీ ఆవేదన

సూపర్ స్టార్ రజినీకాంత్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారిప్పుడు. తన అభిమానులను ఎలా నియంత్రించాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆయన రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకోవడం, కానీ తన అనారోగ్యం దృష్ట్యా కరోనా సమయంలో ఇది ప్రాణానికే ప్రమాదం అన్న ఆలోచనతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రానని, పార్టీ పెట్టబోనని, అభిమానులు అర్థం చేసుకోవాలని ఆయన వినమ్రంగా విన్నవించారు. తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ అభిమానులు ఊరుకోవట్లేదు. అంత విస్పష్టంగా ప్రకటన చేశాక, అనారోగ్యం గురించి చెప్పాక కూడా వాళ్లు రజినీ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి ముందు, పలు చోట్ల ఆందోళనలు చేశారు.

అంతటితో ఆగకుండా తాజాగా అభిమాన సంఘాల నాయకులంతా కలిసి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రజినీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనని తీర్మానం చేశారు. ఈ విషయం రజినీకి తెలిసి చాలా బాధ పడ్డారు. అంతే కాక మళ్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అభిమానులు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, నష్టం చేకూర్చకుండా సమావేశం నిర్వహించుకోవడం మంచి విషయమే అని.. కానీ తన అనారోగ్య పరిస్థితి గురించి వివరంగా చెప్పాక కూడా తాను రాజకీయాల్లోకి రావాల్సిందే అని డిమాండ్ చేయడం సమంజసం కాదని రజినీ అన్నారు. తాను ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాలేనని.. తన బాధను అభిమానులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ డిమాండ్ మాని అభిమానులు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న రజినీ కరోనా టైంలో పార్టీ పెట్టి జనాల్లో తిరిగితే ఆయన ప్రాణానికే ప్రమాదం అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ అభిమానులు రాజకీయ అరంగేట్రంపై ఇంత మొండి పట్టు పట్టడం విడ్డూరం.