అవును! ఇప్పుడు జనసేన విషయంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ అధినేత పవన్ పరువు పోతోందని, ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాపు సామాజిక వర్గానికిచెందిన నాయకులతోపాటు జనసేన పార్టీ సానుభూతి పరులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఎందుకు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు? ఏం జరిగింది? అనే విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. విషయంలోకి వెళ్తే.. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన తరఫున ఒకే ఒక్క అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనే ఎస్సీ నాయకుడు రాపాక వరప్రసాద్.
జనసేన తరఫున గెలిచిన వరప్రసాద్‌పై పవన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. గంగిగోవు పాలు.. అన్నట్టుగా తమకు ఒక్క సభ్యుడు ఉన్నా.. అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామంటూ పవన్ వ్యాఖ్యా నించారు. ఇక, రాపాక కూడా తాను పార్టీలోనే ఉంటానని.. వైసీపీలోకి వెళ్లబోనని అప్పట్లో గట్టిగానే చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా ఆయన వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. సరే! రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకున్నారు అందరూ. ఇక పవన్ కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారు. కేసులు కావొచ్చు, రాజకీయ అవసరాలు కావొచ్చు.. అని సరిపెట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాపాక వ్యవహార శైలి మాత్రం పవన్‌ను, పార్టీ నేతలను రెచ్చగొట్టేలా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
రాపాక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ కార్యకర్తనేనంటూ పవన్ కు షాకిచ్చారు. “సీఎం జగన్ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే మీకు అభ్యంతరం ఏంటి?” అని ప్రశ్నించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులను, జనసేన సానుభూతి పరులనే కాకుండా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజకీయ నేతలను కూడా కలవరపెడుతోంది. ఒక్క అభ్యర్థిని గెలిపించుకుని కూడా ఆయనను దారిలో నడిపించలేక పోతున్నారు. ఇక, పార్టీని ఏవిధంగా నడిపిస్తారు? అంటూ.. కొందరు చూచాయగా పవన్‌పై విమర్శలు సంధిస్తున్నారు. వాస్తవానికి చూస్తే.. ఇది నిజమనే అనిపిస్తోంది.
తన పార్టీ టికెట్‌పై గెలిచిన అభ్యర్థి.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న క్రమంలో పవన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తూనే ఉంది. ఇక, రాపాక వ్యవహార శైలితో ఏకంగా పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారింది. రేపు ఓ నలుగురిని గెలిపించినా.. ఇదే పరిస్థితి కదా! అని ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలు చర్చించుకుంటున్నారు. కాబట్టి.. తక్షణమే ఈ విషయంలో పవన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.