వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా? ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గానే స్పందిస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి స్పందిస్తూ.. రోజా సహా.. వైసీపీ హయాంలో శాప్ చైర్మన్‌గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయిందని.. త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు.
ఏంటీ ఆరోపణలు..
వైసీపీ హయాంలో రోజా.. క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో సుమారు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్రికెట్, వాలీబాల్, హాకీ సహా ఇతర క్రీడలకు సంబంధించిన వస్తువులను బల్క్‌గా కొనుగోలు చేశారు. అయితే.. ఇవన్నీ నాశిరకమేనని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ స్టిక్స్ విరిగి పోవడం.. బ్యాట్లు ముక్కలు కావడం అప్పట్లో ప్రధానంగా కనిపించింది.
అలానే.. రాష్ట్ర వ్యాప్తగా ప్లే గ్రౌండ్స్ ను ఆధునీకరించే పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేయించారు. దీనికిగాను 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అయితే.. ఈ పనులు కూడా నాశిరకంగా సాగాయని అప్పట్లో క్రీడాకారులు ఆరోపించారు. ఆయా పరిణామాలపై కూటమి ప్రబుత్వం వచ్చిన తర్వాత అందిన ఫిర్యాదులతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ పూర్తయి.. ప్రస్తుతం నివేదిక రూపొందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
అవినీతి ఇదీ..
క్రీడా పరికరాలు కొనుగోలు చేసే విషయంలోను.. మైదానాలను చదును చేసి మౌలిక సదుపాయాలు కల్పించే పేరిట మొత్తంగా 100 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని.. ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించింది. ఈ నిధుల్లో రోజా, బైరెడ్డిలు సమానంగా పంచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నివేదిక వచ్చిన వెంటనే రోజా అరెస్టు ఖాయమని టీడీపీ వర్గాలు చర్చిస్తున్నాయి. కాగా.. రోజా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates