ఏకంగా 3 వేల కోట్ల రూపాయల మోసం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, సినిమా నిర్మాత చిక్కుకుపోయారు. తాజాగా బుధవారం ఉదయం సదరు నేత నివాసం సహా.. బంధువుల ఇళ్లు, కార్యాలయాలు, వైసీపీ నేత అనుచరుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్ మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నా యి. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో సేకరించిన నిధులను దారి మళ్లించారన్నది ప్రధాన అభియోగం. ప్రజల సొమ్ములతో విలాస వస్తువుల కొనుగోలు, స్థిరాస్తులను ఏర్పాటు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.
ఎవరీ నేత?
విశాఖపట్నానికి చెందిన మళ్ల విజయప్రసాద్… రాజకీయ నేతగా సుపరిచితుడు. అలాగే వ్యాపారవేత్త కూడా. ఇక, సినిమా నిర్మాతగా ఆయన పలు చిత్రాలు కూడా తీశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాష్ట్ర విభజన తర్వాత.. వైసీపీలో చేరిన విజయ ప్రసాద్.. తదనంతర రాజకీయ పరిణామాల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి జగన్ పాదయాత్ర ప్రభావం ఉన్నప్పటికీ.. టీడీపీ దూకుడుతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ హయాంలో 2021లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APEWIDC) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
కేసు ఇదీ..
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న మళ్ల విజయ ప్రసాద్.. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. ఈ క్రమంలో 3 వేల కోట్ల రూపాయల మేరకు అవకతవకలకు పాల్పడినట్టు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదైంది. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును విదేశాలకు తరలించారన్న ఆరోపణలు రావడంతో ఈ కేసును ఈడీ అధికారులకు బదలాయించారు. తాజాగా ఆయన నివాసం, కార్యాలయాలు, హైదరాబాద్‌లోని సన్నిహితుల ఇళ్లలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates