సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి సూపర్ హిట్స్ తో క్లాసు మాసు రెండు వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ వరస ఫ్లాపులు, వివాహ జీవితంలో ఏర్పడిన కుదుపు తదితర కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. మళ్ళీ రావాతో కంబ్యాక్ ఇచ్చే దాకా తన సంగతి జనాలు మర్చిపోయారు. ఇది హిట్టయ్యింది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుందేమోనని అందరూ భావించారు. కానీ జరుగుతున్నది వేరు.

ఇటీవలే సుమంత్ కొత్త మూవీ న్యూటన్ థర్డ్ లా విడుదలయ్యింది. ప్రమోషన్లు ఓ మోస్తరుగా చేశారు. దర్శకుడు రాజేష్ కర్ణ ఈ సినిమా స్క్రీన్ ప్లేని ఏకంగా మహేష్ బాబు 1 నేనొక్కడినేతో పోల్చుకున్నాడు. మొదటి రెండు రోజులు మల్టీప్లెక్సుల మద్దతు బాగానే దొరికింది. స్పైడర్ మ్యాన్ ఊపులో కూడా దీనికి జనాలు కనిపించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, పబ్లిసిటీలో చెప్పిన విషయాలు జనాన్ని ఓసారి చూద్దామనిపించేలా చేశాయి. ఇంతకీ న్యూటన్ థర్డ్ లాలో ఏముందనే ఆసక్తి సహజం.

ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఓ యువకుడు మేడపై నుంచి కింద పడి చనిపోతాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే తలలో  బుల్లెట్ ఉన్నట్టు తెలుస్తుంది. కేసు విచారణ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ వేదవ్యాస్ కు లోతుకు వెళ్లేకొద్దీ అనూహ్యమైన విషయాలు తెలుస్తాయి. మెర్కురీ అనే డాన్ బయటికి వస్తాడు. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదనే సూత్రం ఆధారంగా చేసుకుని ఒక నేరంలో బాధితులుగా మిగిలిన వాళ్ళు దానికి కారణామైన క్రిమినల్స్ దాకా చేరుకోవడమే ఇందులో మెయిన్ స్టోరీ.

పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దర్శకుడు గొప్పగా చెప్పుకున్న స్క్రీన్ ప్లేనే కొంత కన్ఫ్యుజింగ్ గా నడవడం, సెకండాఫ్ లో అవసరం లేని ల్యాగ్ నింపడం ఓవరాల్ ఫీల్ తగ్గించాయి. కొన్ని ట్విస్టులు షాక్ ఇచ్చేలా అనిపిస్తే మరికొన్ని బలవంతంగా ఇరికించినట్టు తోస్తాయి. ఒకదశలో ఏం జరుగుతుందో అర్థం కానీ సిచువేషన్ వస్తుంది. జగపతిబాబు, రవివర్మ, అవసరాల లాంటి సీనియర్ల అనుభవం బాగా హెల్ప్ అయ్యింది. కథనం ఇంకొంచెం బిగుతుగా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది.