స్థానికాల తరువాత మంత్రివర్గ మార్పులు తప్పవా?

మంత్రులు మౌనంగా ఉంటే స‌హించేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రుల‌కు ఆయ‌న ఈ విష‌యంలో ఇప్ప‌టికే చాలా సార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ చాలా మంది మంత్రులు మౌనంగా ఉండ‌డం.. క‌నీసం ప‌న్నెత్తు విమ‌ర్శ కూడా చేయ‌క‌పోవ‌డంతో సీఎం మ‌రోసారి వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఉద‌య‌మే టెలీ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించిన సీఎం చంద్ర‌బాబు.. మంత్రుల‌కు వారి బాధ్య‌త‌ల‌ను గుర్తు చేసిన‌ట్టు తెలిసింది.

ఫైళ్ల క్లియ‌రెన్సు, శాఖ‌ల‌పై ప‌ట్టు విష‌యంలో రెండున్న‌రేళ్లు అవుతున్నా.. ఇప్ప‌టికీ ఐదుగురు టీడీపీ మంత్రులు ప‌ట్టు పెంచుకోలేక పోయార‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఇక‌, ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న దాడిని ఎదుర్కొన‌డంలో దాదాపు స‌గం మంది మౌనంగానే ఉంటున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంకా.. ప్ర‌తి విష‌యాన్నీ తాను చెప్పాలంటే కుద‌ర‌ద‌ని.. ఇక నుంచి అయినా.. మిష‌న్ మోడ్‌తో ప‌నిచేయాల‌ని సూచించారు. ప్ర‌త్య‌ర్థులు రెచ్చిపోతున్నా.. మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మంత్రుల‌కు బాధ్య‌త‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఒక్క చోట కూడా.. కూట‌మి పార్టీలు ఓట‌మి చ‌వి చూడ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌న్నారు. అదే స‌మ‌యంలో మీడియా ముందుకు రావ‌డం.. ప్ర‌జ‌లకు మంచిని వివ‌రించ‌డం చేయాల‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా.. దాని తాలూకు ఫ‌లితం ఓట్ల రూపంలో మారక‌పోతే.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

నేనే స్వ‌యంగా..

తానే స్వ‌యంగా మంత్రుల ప‌నితీరును ప‌రిశీలించ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రులు.. అస‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డం లేద‌ని త‌న‌కు నివేదిక‌లు అందాయ‌న్నారు. ముఖ్యంగా అంత‌ర్గ‌త పోరును త‌గ్గించాల‌ని చెబుతున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఇది స‌రికాదన్న ఆయ‌న `ప‌నితీరు మెరుగు ప‌రుచుకోని వారు.. ఆలోచ‌న చేసుకోవాలి“ అని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఫ‌లితాన్ని బ‌ట్టి మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌పై సంకేతాలు ఇచ్చేశారు.