పరశురాముడి రూపంలో రాహుల్ గాంధీ

రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు చేయడం తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వివాదంలో నిలిచారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా పరశురాముడి రూపంలో రూపొందించిన చిత్రం, దానికి నిర్వహించిన పాలాభిషేకం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వారణాసిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గంగా నది తీరంలోని ఘాట్ వద్ద రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, లడ్డూ కేక్ కట్ చేస్తూ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రంలో రాహుల్ గాంధీని భగవాన్ పరశురాముడి రూపంలో చిత్రీకరించారు. కాషాయ వస్త్రధారణలో ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నట్లుగా ఆ చిత్రాన్ని రూపొందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది ప్రతీక అని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు.

అయితే ఈ కార్యక్రమం తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు హిందుత్వవాదులు పరశురాముడి రూపంలో ఒక రాజకీయ నాయకుడిని చూపించడం అభ్యంతరకరమని విమర్శించారు. హిందూ దేవతల రూపాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇక విమర్శకులు కాంగ్రెస్ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. హిందూ ఆచారాలు, విశ్వాసాల విషయంలో గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఇప్పుడు రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడాన్ని ద్వంద్వ వైఖరిగా అభివర్ణిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివలింగాలపై పాలు పోయడాన్ని విమర్శించిన వారు, రాహుల్ గాంధీ చిత్రానికి పాలాభిషేకం చేయడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు.