మందు బాబుల ప్లానింగ్ మామూలుగా లేదు

దేశంలో క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 22న జ‌న‌తా క‌ర్ఫ్యూ అన్నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఒక్క రోజే క‌దా.. ఇళ్ల నుంచి బ‌య‌టికి రాక‌పోతే ఏమ‌వుతుందిలే అనుకున్నారంద‌రూ. కానీ త‌ర్వాతి రోజు వ‌చ్చి మూడు వారాల లాక్ డౌన్ అంటూ బాంబు పేల్చాడు ప్ర‌ధాని.

ఇక అక్క‌డి నుంచి మొద‌లైంది ఇంటి వాసం. బ‌య‌ట అన్నీ బంద్. ఇంటిప‌ట్టున మందు కొట్టి ఎంజాయ్ చేద్దామ‌నుకున్న మందుబాబుల‌కు అవ‌కాశ‌మే లేక‌పోయింది. అప్ప‌టికే ఇంట్లో స్టాక్ పెట్టుకున్న కాస్త మందు కొన్ని రోజుల్లో అయిపోయింది.

లాక్ డౌన్ ఎత్తేస్తారు వైన్ షాపుకు వెళ్దాం అంటే ఛాన్స్ దొరికితే కదా. ఒక‌టికి రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మ‌రి ఎప్పుడు ఆంక్ష‌లు తొల‌గిపోతాయో.. వైన్ షాపులు ఎప్పుడు తెరుచుకుంటాయో అని మందుబాబులు ఉత్కంఠ‌గా ఎదురు చూశారు.

దేశవ్యాప్తంగా మ‌రోసారి లాక్ డౌన్ పొడిగించిన‌ప్ప‌టికీ.. రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితులు చాలా క‌ష్టంగా మారిన నేప‌థ్యంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది ప్ర‌భుత్వం. సోమ‌వారం మెజారిటీ రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో ఉద‌యం నుంచే మందుబాబులు బారులు తీరారు.

ఐతే వైన్ షాపుల ద‌గ్గ‌ర జ‌న‌సందోహం చూశాక‌.. గంట‌లు గంట‌లు ఎదురు చూశాక.. ఇంకోసారి మ‌ద్యం దుకాణాల‌కు రావ‌డం అంత సులువు కాద‌నిపించిందో.. లేక మ‌ళ్లీ ఎక్క‌డ మ‌ద్యం దుకాణాలు మూసేస్తారో అన్న భ‌యం పుట్టిందో కానీ.. ఒకేసారి పెద్ద ఎత్తున స్టాక్ తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు మందుబాబులు.

50 వేల‌కు.. 90 వేల‌కు మ‌ద్యం కొన్న బిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎంత మందుకు క‌రువొచ్చినా కూడా ఒకేసారి ఇంత స్టాక్ ప‌ట్టుకుపోవాలా అంటూ ఆ బిల్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు నెటిజ‌న్లు.