పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తోంది. వాస్త‌వానికి ఏపీలో జ‌న‌సేన అధికారంలో ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వ స‌హ‌కారం.. స‌మన్వ‌యం వంటివి కొర‌వ‌డ్డాయి. గెలిచిన అసెంబ్లీ స్థానాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లోపించింది.

ఈ నేప‌థ్యంలో త‌ర‌చుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌న‌సేనాని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా పార్టీని క్షేత్ర‌స్థాయిలో పుంజుకునేలా చేయాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి.

ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి 28 మంది స‌భ్యుల‌తో కూడిన క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అంటే.. 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో 700 మంది స‌భ్యులు పార్టీకి అందుబాటులోకి వ‌స్తారు. ఈ క‌మిటీల‌కు.. జ‌న‌సేన నిర్మాణ స‌మాచార సేక‌ర‌ణ క‌మిటీలుగా పేరు పెట్టారు. వీటిలో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్‌ నాయకులు, ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొన్న ముగ్గురు సాధకులతో మొత్తం ఏడుగురు ప్రధాన సభ్యులు ఉంటారన్నారు.

అదేస‌మ‌యంలో వీరిని స‌మ‌న్వ‌యం చేసేందుకు.. 21 మంది సాధ‌కులు ఉండ‌నున్నారు. వీరిలో కొంద‌రు మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. వీరు క్షేత్ర‌స్థాయిలో పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌ను క‌లిసి పార్టీ సిద్ధాంతాల‌ను వివ‌రిస్తారు. అదేవిధంగా ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేర వేస్తారు. త‌ద్వారా ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుని పార్టీకి నివేదిక‌ల రూపంలో అందిస్తారు. దీనిని అనుస‌రించి.. పార్టీ మార్పులు, చేర్పుల దిశ‌గా అడ‌గులు వేయ‌నుంది. తద్వారా పార్టీ పుంజుకుంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యూహం ర‌చించారు.