ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. జగన్ పై ఇటు సీబీఐతో పాటు ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసి ఇప్పటికే దాదాపుగా 13 ఏళ్లు గడుస్తోంది. అయినా ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదే అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ యువనేత, ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన చింతకాయల విజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ హైకోర్టు కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో తొలుత సీబీఐ జగన్ పై కేసులు నమోదు చేసి ఏకంగా ఆయనను అరెస్టు చేసింది. ఇక ఈ కేసుల్లో ఆర్థిక పరమైన వ్యవహారాలు ఉన్న కారణంగా…సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుల విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడేలా జగన్ యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఈ కేసుల్లో విచారణ త్వరితగతిన ముగిస్తే… జగన్ దోషిగా తేలడం ఖాయమని, ఆయన తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో పార్లమెంటు వేదికగా జగన్ పై నమోదు అయిన కేసుల విచారణ ఎప్పుడు ముగుస్తుందంటూ టీడీపీ ప్రస్తావించడం గమనార్హం. ఇటీవలే రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున చింతకాయల విజయ్ ని టీడీపీ అధిష్ఠానం పెద్దల సభకు పంపిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం తాను చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని భావించిన విజయ్… పార్టీ తరఫున పార్టీ గళాన్ని బలంగా వినిపించే దిశగా సాగుతున్నారు. అందులో బాగంగానే ఆయన బుధవారం నాటి రాజ్యసభ సమావేశంలో జగన్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా విజయ్.. జగన్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు.
జగన్ కేసులపై సూటిగానే సుత్తిలేకుండా ప్రస్తావించిన విజయ్… సందర్భానుసారంగానే ఈ విషయాన్నిలేవనెత్తారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సంబంధించిన బిల్లు గురించి మాట్లాడిన సమయంలో ఆయన జగన్ కేసుల విషయాన్ని ప్రస్తావించారు. సకాలంలో న్యాయం అందకపోతే… అన్యాయం జరిగినట్టేనన్న వాదనను ఈ సందర్భంగా ఆయన బలంగా వినిపించారు. ఆయా నేరాల్లో. ప్రత్యేకించి ప్రజా ప్రతినిధులపై నమోదు అయిన కేసుల్లో విచారణలు నిర్ధిష్ట కాల పరిమితిలో ముగియాలని నిబంధనలు చెబుతున్నా… ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమమైన న్యాయం అందాలన్న ప్రాథమిక సూత్రాన్ని అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సమన్యాయం అందని వైనాన్ని చెబుతున్న క్రమంలో విజయ్.. జగన్ కేసుల జాప్యాన్ని ఉదహరించారు. జగన్ పై 31 కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 11 చార్జిషీట్లు కోర్టుల్లో దాఖలు అయ్యాయని ఆయన తెలిపారు. ఈ చార్జీషీట్లు ఇంకా డిశ్చార్జీ దశలోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన విజయ్… తీవ్రమైన ఆర్థిక అభియోగాలతో నమోదు అయిన కేసుల్లోనూ విచారణ జాప్యమైతే ఎలా అని ప్రశ్నించారు.
చార్జిషీట్లు 13 ఏళ్ల పాటు అలా న్యాయస్థానాల్లోనే ఉంటే…వాటిపై విచారణలు ఎప్పుడు జరగాలి? నేరస్తులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. అయితే బిల్లుపై మాత్రమే మాట్లాడాలని చెప్పిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్… విజయ్ కి సూచించారు. అయినా కూడా విజయ్ తాను చెప్పదలచుకున్న విషయం మొత్తాన్ని చెప్పేసి కూర్చుండిపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates