తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద ఎత్తున తెలంగాణ పార్టీల నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు భారీ కౌంటర్లు పడిన విషయం తెలిసిందే. దీంతో మరింత పట్టుదలకు పోయిన పవన్ కల్యాణ్.. తాను తెలంగాణలో పార్టీని విస్తరిస్తానని.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని.. తన వారిని కూడా తిప్పుతా నని సంచలన ప్రకటన చేశారు.
ఇక, ఆ తర్వాత.. ఒకరిద్దరు తెలంగాణ వాదులు సైతం పవన్‌కు అండగా నిలిచారు. నిన్న మొన్నటి వరకు వివాదంగా మారిన ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం.. తెలంగాణకు పవన్ రాకను స్వాగతించారు. ఆయన తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సంపూర్ణ హక్కులు ఉన్నాయని, రాజ్యాంగం ప్రకారం.. ఆయన ఎక్కడైనా రాజకీయాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.
అలానే.. బీఆర్ఎస్ పార్టీ(తెలంగాణ వాదంతో ఏర్పడిన పార్టీ) కూడా గతంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు చేసేందుకు రెడీ అయిన వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించారు. అంతేకాదు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది రాజకీయ నేతలతోనూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి భేటీ అయి.. ఏకం చేసేందుకు ప్రయత్నించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ(ప్రస్తుతం అధికారంలో ఉంది) కూడా దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీ కావడం గమనార్హం.
ఇలా.. రాజకీయ పార్టీలు.. ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేశాయి.. చేస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు ఎలా ఉన్నా.. పవన్ ప్రకటన చేసిన తర్వాత.. ఇప్పుడు ఆయా పార్టీల వ్యవహారం కూడా చర్చకు వస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ తెలంగాణలో విస్తరించడం తప్పుకాదని.. ఇక్కడ కూడా రాజకీయాలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుండడం.. దీనికి మద్దతు కూడా చేకూరుతుండడం గమనార్హం. సో.. మొత్తంగా వ్యతిరేకించిన వారి గళాలు మెత్తబడుతుండగా.. పవన్‌కు అనుకూల గళాలు పెరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates