జనసేన తన 12 ఏళ్ల ప్రస్థానంలో తొలి పదేళ్ల పాటు ఎలాంటి చట్టసభల ఎంట్రీ లేకుండానే సాగింది. అయినా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని ఓపిగ్గా కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం సక్సెస్ రేటును సాదించి చట్టసభల్లోకి జనసేన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే సారి ఇటు అసెంబ్లీతో పాటుగా అటు లోక్ సభలోనూ ఆ పార్టీ బలమైన అడుగు వేసింది. తాజాగా ఆ పార్టీ ఇప్పుడు పెద్దల సభగా పిలుచుకుంటున్న రాజ్యసభలోనూ అడుగు పెట్టబోతోంది. ఈ మేరకు కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో ఓ కీలక నిర్ణయం జరిగింది.
ప్రస్తుతం ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా…త్వరలోనే ఈ స్థానాలు భర్తీ కానున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాల ఆధారంగా ఈ నాలుగు స్థానాలు కూడా కూటమి పార్టీలకే దక్కనున్నాయి. విపక్ష వైసీపీకి ఈ దఫా గుండు సున్నానే మిగలనుంది. తమకు దక్కిన నాలుగు రాజ్యసభ సీట్లను ఏ రీతిన సర్దుబాటు చేసుకోవాలన్న అంశంపై గురువారం జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం మేరకు అందుబాటులో ఉన్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఓ సీటు జనసేనకు దక్కనుంది. మిగిలిన మూడు సీట్లు టీడీపీకే దక్కనున్నాయి. ఈ దఫా బీజేపీకి సీటు ఖరారు కాలేదు. గతంలో ఆ పార్టీకి రాజ్యసభ సీటు కేటాయించిన నేపథ్యంలో తాజా సీట్లలో ఆ పార్టీకి సీటేమీ ఇవ్వని రీతిలో నిర్ణయం జరిగింది. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. నాలుగు సీట్లలో ఓ సీటును జనసేనకు ఇస్తున్నామని చెప్పిన ఆయన… మిగిలిన మూడు సీట్లను టీడీపీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే… రాజ్యసభ ఎంట్రీ అవకాశం దక్కిన జనసేన నుంచి ఆ పార్టీ ఎవరికి సీటు ఇస్తుందన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే… ఆ సీటును ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిర్ణయం అయితే తీసుకోలేదని స్వయంగా జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
అభ్యర్థి ఎంపికను అధినేత హోదాలో పవన్ కల్యాణే త్వరలో తీసుకుంటారని ఆ ప్రకటనలో తెలిపింది. ఇక జనసేనకు ఈ ఒక్క సీటుతో పాటుగా త్వరలోనే మరో మూడు రాజ్యసభ సీట్లు దక్కనున్నట్లుగా కూడా ఆ పార్టీ తెలిపింది. మొత్తంగా 2029 సార్వత్రిక ఎన్నికలలోగా రాజ్యసభలో జనసేనకు మొత్తంగా నాలుగు సీట్లు దక్కనున్నాయన్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates