ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. ఆయా నిర్మాణాల కోసం సరిపడ డబ్బు, ఇతరత్రా సామాగ్రి ఉన్నా.. కార్మికులు లేకపోతే… ఆ పని ఇంచు కూడా కదలదు.
ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతున్న వేళ… కార్మికుల పాత్ర మరింతగా పెరిగిపోయింది. ఇక ఏపీ రాజధాని అమరావతి విషయానికి వస్తే… వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు వస్తున్నారు. వెళుతున్నారు. ఒక్కో కాంట్రాక్టరు ఒక్కో రీతిన వ్యవహరిస్తున్న కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కార్మికుల వసతి కోసం పక్కా ఏర్పాట్లు చేయాలని కూటమి సర్కారు తన కాంట్రాక్టర్ల తెగేసి చుబుతోంది.
కాంట్రాక్టర్లకు మాట మాత్రంగా చెప్పడానికి బదులుగా అసలు కార్మికుల వసతి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఆయా లేబర్ అడ్డాల్లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి? వంటి విషయాలను విస్పష్టంగా చెప్పేందుకు కూటమి సర్కారు రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్ (లేబర్ అడ్డా) నమూనాను గుంటూరులో ఏర్పాటు చేసింది. అందులో కార్మికుల వసతి కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను కళ్లకు కట్టినట్టు చూపింది.
లేబర్ అడ్డాల్లో ఆయా ఏర్పాట్లతో పాటుగా కార్మికులకు తమ హక్కులు, బాధ్యతలపై మరింత అవగాహన పెంచే దిశగా పలు సూచనలు సలహాలను ఆ లేబర్ అడ్డాలో పొందుపరచింది. చదువు వచ్చిన కార్మికులతో పాటుగా చదువు రాని వారికి కూడా సులభంగ అర్థమయ్యేలా ఈ అవగాహన ప్రకటనలను పొందుపరచింది.
అమరావతి పరిధిలోనే కాకుండా ఇతరత్రా పని ప్రదేశాల్లో కూడా కార్మికుల కోసం ఈ తరహా లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేసింది. ఈ సూచనలను పాటిస్తే…పని ప్రదేశాల్లో కార్మికులకు మంచి వసతులు లభించినట్టేనని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates