ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వబోం: కోమటిరెడ్డి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను తీవ్రంగానే నొప్పించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంంగాణ పట్ల తనకు ఎంతమాత్రమూ ద్వేషం లేదని పవన్ చెప్పినా.. ఆయన మాటల్లో ఆంధ్రా నేతల్లో గతంలో కనిపించిన ద్వేషమే కనిపించిందన్న తలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు.

ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ తీరును తప్పుబట్టారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన ఓ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. తెలంగాణ పట్ల విద్వేషం చిమ్ముతున్న ఆంధ్రా వాళ్లకు ఇకపై తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమని ఆయన సంచలన ప్రకటన చేశారు.

తెలంగాణ వాళ్లకు ఆంధ్రా కాంట్రాక్టర్లు కావాలి కాని… తన లాంటి నేతలు అవసరం లేదా? అని పవన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావించిన కోమటిరెడ్ది.. ఇకపై తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు పనులను కూడా ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కూడా తాము వెనుకాడబోమని కూడా మంత్రి చెప్పారు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామన్న మంత్రి… బరి గీసి నిలబడతామని కూడా ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా మీరు ఏపీకి ఉన్నారని, ఏదైనా చేయాలనుకుంటే… ఆంధ్రాలో చేసుకోవాలని సూచించారు.

పవన్ మాటలను చూస్తుంటే… గతంలో తెలంగాణపై కనిపించిన వ్యతిరేక భావం, ద్వేష భావమే ఇప్పుడూ కనిపిస్తోందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయినా తెలంగాణ పట్ల అంత అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో ఆంద్రోళ్లు వ్యాపారాలు చేసుకుంటే ఫరవా లేదన్న మంత్రి… తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తామంటూ సహించేది లేదని పవన్ ను హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారి త్యాగాలను అవమానించినట్టుగానే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా తెలంగాణ వ్యతిరేక భావనలను ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు.