జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో దేశ వ్యాప్తంగా జంతర్ మంతర్ చర్చ జరుగుతుంది. దేశ నడిబొడ్డున పార్లమెంట్ స్ట్రీట్ లో రాష్ట్రపతి భవన్ కు దగ్గరగా వుంది. నిరసనలకు ఎంతగానో ఫేమస్ అయింది. అయితే ఇక్కడ ధర్నాలు, నిరసనలు జరగకుండా చూడాలని ఎప్పటి నుంచో స్థానికులు కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా జంతర్ మంతర్ కు ప్రత్యామ్నాయ వేదిక చూడాలని సుప్రీం కోర్టులో పిటేషన్ వేశారు.

జంతర్ మంతర్ వద్ద తరచుగా జరుగుతున్న నిరసనలు, ధర్నాల వల్ల స్థానికుల రాక పోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పిటీషన్ దాఖలైంది. నిత్యావసర సరుకుల రవాణా కు ఆటంకం కలుగుతుందని, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతుందని పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిమీద ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ జాయ్ మాల్య భాగ్చి, జస్టిస్ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పిటీషనర్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని, చాలా కీలక మైనవని వ్యాఖ్యనించారు.

స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రత్యామ్నాయ వేదికను గుర్తించాలని, అందుకు కేంద్రం నుంచి సూచనలు తీసుకొని రావాలని సోలిసిటర్ జనరల్ ను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సహా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటే జంతర్ మంతర్ లో నిరసనలకు చెక్ పెట్టినట్టవుతుంది.

దేశంలో ఐదు జంతర్ మంతర్లు…

జంతర్ మంతర్ అనగానే మందరికీ ఢిల్లీలోని జంతర్ మంతర్ ఒక్కటే గుర్తుకు వస్తుంది. కానీ దేశంలో ఐదు చోట్ల జంతర్ మంతర్లను నిర్మించారు. ఢిల్లీ, జైపూర్, వారణాసి, మధుర, ఉజ్జయనిల్లో నిర్మించారు. వీటిలో జైపూర్ లో వున్న జంతర్ మంతర్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపాదగా గుర్తించగా ఢిల్లీలోని జంతర్ మంతర్ ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించింది.