బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం  

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా థియేటర్లలు కళకళలాడాయి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి దాదాపు అన్ని షోలకు టికెట్లు అయిపోయి చాలా మంది నిరాశగా వెనుదిరిగిన దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎగబడుతున్న వైనం ప్రతి చోటా దర్శనమిచ్చింది. కొన్ని సెంటర్లలో రికార్డులు వచ్చేలా ఉన్నాయి.

అనూహ్యంగా చెన్నై లవ్ స్టోరీ పుంజుకోవడం మరో మంచి పరిణామం. గంటకు అయిదు వేల దాకా టికెట్లు అమ్ముడుపోవడం అది కూడా రెండో వారంలో అంటే సూపర్ హిట్ స్టేజిని దాటేసినట్టే. శ్రీనివాస మంగాపురంకు టాక్ తో సంబంధం లేకుండా డీసెంట్ నెంబర్లు పడ్డాయి. కృష్ణ  గారి మనవడనే పాయింట్ బిసి సెంటర్ల జనాన్ని ఓ మోస్తరుగా లాగింది. సుమంత్ న్యూటన్ థర్డ్ లాకు మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ బాగుంది. ఇదే హీరో గత సినిమాకు ఇందులో సగం ఓపెనింగ్ కూడా రాలేదు.

మొత్తంగా చూసుకుంటే థియేటర్లలో జనం నిండుగా కనిపించడం బయ్యర్ వర్గాలను ఆనందానికి గురి చేసింది. క్యాంటీన్, పార్కింగ్ స్టాండ్ మొదలైనవి సందడిగా కనిపించాయి. రేపటి నుంచి ఇందులో సగం జోరైనా ఉంటుందా అంటే చెప్పలేం కానీ ఆగస్ట్ తొలి రోజుల బోణీ బాగుందని చెప్పొచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే లిమిటెడ్ స్క్రీనింగ్ ఉన్నా సరే ది ఒడిస్సికి సైతం ఫుల్స్ పడ్డాయి. జన నాయకుడు ఫైనల్ రన్ కు వచ్చేసినా సండే రోజు దీనికి ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు లేకపోలేదు.

వచ్చే వారం కూడా ఇదే జోరు కొనసాగితే టాలీవుడ్ బాక్సాఫీస్ కుదుటపడినట్టే. జనవరి తర్వాత వరసగా మూడు నెలలు డ్రై పీరియడ్ లో నరకం చూసిన థియేటర్లు క్రమంగా కోలుకుంటున్నాయి. జనాలు కంటెంట్ బాగుంటే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పెద్ది, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ నిరూపించాయి. నెక్స్ట్ వీక్ కొరియన్ కనకరాజు దీన్ని కొనసాగించగలిగితే విశ్వనాథ్ అండ్ సన్స్ అటుపై ఇరుముడి చివర్లో టాక్సిక్ ఇలా నెల మొత్తం సందడి సందడిగా ఉండబోతోంది.