ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు.. వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు.. సేనా గళం పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తు న్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్-జీ మాట వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ యువతకు ప్రాధాన్యం పెంచనుందని చెప్పారు. ఈ సేనాగళం ద్వారా.. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు పాటు పడే వారికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు.
సేనాగళం పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్.. యువతకు ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారికి ఈ కమిటీలలో ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ నాయకులకు సూచించారు. నియోజకవర్గాల వారీగా సేనాగళం కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కమిటీకి.. కులాలు, మతాలతో పని ఉండదని.. ప్రజలకు అవసరమైన.. ప్రభుత్వం చేస్తున్న పనులను వారికి అందేలా చేయడమే.. ఈ కమిటీ లక్ష్యంగా పేర్కొన్నారు. కులాల కుమ్ములాటలకు సేనా గళం కమిటీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండదని తేల్చి చెప్పారు.
బూర్జువా సంస్కృతులకు జనసేన తీవ్ర వ్యతిరేకమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. పాతకాలపు విధానాలను బుట్ట దాఖలు చేస్తామన్నారు. అభ్యుదయ భావాలు.. ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఉన్నవారికి పార్టీలోను.. ముఖ్యంగా సేనా గళం కమిటీలోనూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. కొందరు నాయకులు, పార్టీలు కూడా.. తాము చేస్తున్న తప్పులకు కులం కార్డు తొడుగుతున్నారని.. సున్నితమైన అంశాలకు కులాలు, మతాల ముచ్చట్లను ముడిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తులు చేసే తప్పులకు సమాజం బాధ్యత వహించాలా? అని ప్రశ్నించిన ఆయన.. దీనినే నేటి యువత వ్యతిరేకిస్తోందన్నారు.
సేనా గళం బాధ్యతలు ఇవీ..
- సేనా గళంలో చేరే వారికి.. వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి.
- విద్యావంతులకు పెద్దపీట… చదువుకున్నా లేకున్నా.. సమాజానికి మేలు చేయాలన్న భావనతో ఉండాలి.
- కులాలకు, మతాలకు అతీతంగా కమిటీలను ఏర్పాటుచేయాలి.
- కుల రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలకాలి.
- దేశం భావన ప్రతిబింబించేలా కమిటీలు ఉండాలి. అలానే పనిచేయాలి.
- యువతరం ఆశలను ఈ కమిటీలు ప్రతిబింబించాలి.
- ప్రజలతోను.. ముఖ్యంగా యువతతోనూ మమేకం కావాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates