మళ్ళీ పేపర్ లీక్ అయిందా సారూ…

పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు.  కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం లేదు. జైలు, జరిమానా అంటూ బిల్లు తెచ్చినా డోంట్ కేర్ అంటున్నారు. 

యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం…

పేపర్ లీకేజిని అరికట్టే ఉద్దేశ్యంతో రూపొందించిన యాంటీ పేపర్ లీకేజి బిల్లుకు గురువారం పార్లమెంటు ఆమోదించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేసినప్పటికీ మూజువాణి ఓటుతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీక్, పరీక్షల్లో అక్రమాలకు కఠిన శిక్షలు విధిస్తారు.

కనీసం 5ఏండ్ల నుంచి గరిష్టంగా 10 ఏండ్లు జైలు శిక్ష విధిస్తారు. 10 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధిస్తారు. ఈ బిల్లుతో అక్రమార్కులు చేతులు కట్టుకొని కూర్చుంటారని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని మేధావులు, ఇండియా సభ్యులు వాదిస్తున్నారు. అయితే అదేరోజు ఒడిశాలో మెడికల్ పీజీ పరీక్షలకు సంబందించి పేపర్ లీక్ కావడం దేశాన్ని నివ్వెర పరిచింది.

వాట్సాప్ లో మెడికల్ పీజీ ప్రశ్నాపత్రాలు….

ఒకవైపు పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసైన రోజే మరోవైపు బీజేపీ పాలిత ఒడిశా రాష్ట్రంలో మెడికల్ పీజీ పరీక్ష పేపర్ లీకయింది. 2023-26 ఎం ఎస్, ఎం డి బ్యాచ్ కు సంబందించిన జులై 27వ తేదీన  జనరల్ సర్జరీ థియరీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్న పత్రం వాట్సాప్ లో దర్శనమిచ్చింది.

భువనేశ్వర్ లోని  మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ది ఒకరు వాట్సాప్ లో వచ్చిన ప్రశ్నా పత్రాలను బయట పెట్టడం సంచలనం సృష్టించింది. దీంతో ఉలిక్కి పడిన ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో యాంటీ పేపర్ లీకేజి బిల్లుపై చర్చ జరుగుతుంది. రాజకీయ, పాలనా పరమైన చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి బిల్లులు ఎన్ని వచ్చినా వృధా ప్రయాసగా మేధావులు అభివర్ణిస్తున్నారు.