వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పనితీరు ఎలా ఉన్నా.. ఇటీవల కాలంలో పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే.. ఈవాయిస్సే ఒక్కొక్క సందర్భంలో వివాదానికి దారితీస్తోంది. తాజాగా భూమన వ్యాఖ్యలు, ఆయన వ్యవహారానికి స్వామీజీల నుంచి సెగ తగిలింది. కరుణాకర్ రెడ్డి హిందువులను, హిందూత్వను అవమా నిస్తున్నారంటూ.. పలువురు స్వాములు.. నిరసన తెలిపారు.
ఎందుకు?
తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.. కరుణాకర్ రెడ్డి వ్యవహ రిస్తున్నారని.. గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ సంప్రదాయాలు, మర్యాదలపైనా ఆయన విమర్శలు చేస్తున్నారని పలువురు స్వాములు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హిందూ సమాజానికి, తిరుమల శ్రీవారి భక్తులకు కూడా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అయితే.. కరుణాకర్ రెడ్డి మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతికి వచ్చిన వివిధ మఠాలకు చెందిన పలువురు స్వామీజీలు.. కరుణాకర్ రెడ్డి తీరును నిరసిస్తూ.. శాంతియుత ధర్నా, నిరసనకు దిగారు. నగర సంకీర్తన చేసుకుంటూ.. శిల్పారామం నుంచి భూమన ఇంటికి చేరుకుని.. ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు వీరిని గుర్తించి అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత.. వారు శాంతించి వెనుదిగారు.
వాళ్లంతా టీడీపీ వారే!
కాగా.. స్వాములు చేసిన నిరసనపై భూమన మరోసారి ఫైరయ్యారు. ఈ సందర్భంగా కూడా.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయం ధరించిన వారంతా .. టీడీపీ కార్యకర్తలేనని వ్యాఖ్యానించడం మరింత దుమారం రేపింది. ఉద్దేశ పూర్వకంగానే తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. తిరుమలలో జరుగుతున్న అపచారాలనే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. కానీ, తనకు వ్యతిరేకంగా కొందరు.. కాషాయం కప్పుకొన్న వారిని పంపించారని భూమన అన్నారు. ఈ వ్యవహారం మరోసారి రచ్చకు దారి తీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates