కరోనా వైరస్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడటం వల్లే ఈ రోజు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా వణికిపోతుంటే.. ’ఇది సాధారణ జ్వరమే’ అని జగన్ మాట్లాడటం వల్లే నివారణా చర్యల్లో అలసత్వం నెలకొని ఉంటుందని.. ఈ విధంగా మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుందని.. మన ఆరోగ్య శాఖ పటిష్టంగా లేకపోవడం వల్ల తలెత్తే దుష్ఫలితాలు ‘కరోనా‘తో బయటపడుతున్నాయని పవన్ విమర్శించారు.
సోమవారం జనసేనాని అనంతపురం జిల్లా పార్టీ నేతలతో కరోనాకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. కేరళ లాంటి రాష్ట్రాలు ముందు నుంచి ప్రజారోగ్యం విషయంలో పకడ్బందీగా ఉండటంతో కరోనా విషయంలో సమర్థంగా వ్యవహరించగలిగాయని.. కానీ ఏపీలో ఈ పరిస్థితి లేదని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయులుగా అయిపోయారని, ఏపీలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచిన వారికి సరైన ఆహారం, సదుపాయాలు లేవని పవన్ ఆరోపించారు.
తాము పకడ్బందీగా చర్యలు చేపట్టకపోతే ఏపీలోని కర్నూలు, గుంటూరుల్లా తమ రాష్ట్రం కూడా అయ్యేదని తెలంగాణ మంత్రి ఒకరు ఇటీవల వ్యాఖ్యలు చేశారని, ఏపీలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ మాటలే నిదర్శనమని, ఈ విషయంలో ఏపీని ఉదాహరించి రావడం బాధాకరమని జనసేనాని అన్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత అసలు సవాల్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని.. ఏపీలో గ్రీన్, ఆరెంజ్ జోన్లు.. రెడ్ జోన్లుగా మారకుండా రాష్ట్ర పాలనా యంత్రాంగం చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates