అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే కాన్వాయ్ వ‌ర‌కు.. అట్ట‌హాసంగా ఉండాల్సిందే.. అదిరిపోవాల్సిందే.. అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తారు. ఏమాట‌కు ఆమాట చెప్పాల్సి వ‌స్తే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, గ‌తంలో ప‌నిచేసిన ముఖ్య‌మంత్రులు కూడా ఇలాంటి ఆడంబ‌రాల‌కు అతీతంకాదు. లెక్క‌కు మిక్కిలిగా స‌మావేశ మందిరాలు.. వాటిలో ఏర్పాటు చేసేందుకు ఫారిన్ కుర్చీలు, సోఫాలు!.

ఇక‌, కేసీఆర్‌హ‌యాంలో అయితే.. ప్ర‌తి ఆరు మాసాల‌కు కాన్వాయ్‌లో వాహ‌నాలు మార్చేశార‌న్న పేరుంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్ చేసిన‌ప్పుడు కూడా ఇదే వాద‌న వినిపించింది.ఇ ప్పుడు కూడా అదే ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. ఇక‌, ప్ర‌ధాని మోడీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయ‌న వేసిన చొక్కా.. వేయ‌ర‌ని.. గ‌తంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పార్ల‌మెంటు వేదిక‌గానే ప్ర‌క‌టించి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

ఇలా.. అధికారంలో ఉన్న‌వారు ఆడంబ‌రాల‌కు పోతుంటే.. ఐదు సార్లు ముఖ్య‌మంత్రి అయిన‌.. ఎన్‌. రంగ‌స్వామి మాత్రం.. అదే చెక్క కుర్చీ.. దాని ముందు అదే పాత బ‌ల్ల‌.. చేతిలోనూ 10 రూపాయ‌ల పెన్నే!. ప్ర‌స్తుతం ఈ శైలి.. సీఎం వ్య‌వ‌హారం కూడా నెటిజ‌న్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పుదుచ్చేరిలో అధికార పార్టీగా ఉన్న ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీ బీజేపీతో క‌లిసి విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ఐదోసారి ముఖ్య‌మంత్రిగా రంగ‌స్వామి బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేసి.. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

కాన్వాయ్‌కాదు.. కారే!

పుదుచ్చేరి ఏమన్నా బీద రాష్ట్ర‌మా? అంటే కానేకాదు. ప‌ర్యాట‌కంగా ముందున్న గోవా త‌ర్వాత‌. రెండో రాష్ట్రం ఇదే. ప్ర‌ధాన ఆదాయం యానం ర‌వాణా నుంచే వ‌స్తుంది. అక్ష‌రాస్య‌త నుంచి ఆదాయం వ‌ర‌కు ఇక్క‌డ భేషైన తీరు క‌నిపిస్తుంది. అయినా.. 75 ఏళ్ల ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి ఎప్పుడూ ఆడంబ‌రాల‌కు పోలేదు. త‌న ఇంటి నుంచి ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఇప్ప‌టికీ.. ఆయ‌న బుల్లెట్‌పై సొంత ఖ‌ర్చుల తోనే వ‌స్తారు. పెట్రోలు ఖ‌ర్చు త‌న జేబులోంచే పెట్టుకుంటారు. విందు, వినోదాల పేరిట ఖ‌జానాను ఖాళీ చేయ‌రు.

చిత్రం ఏంటంటే.. ఆయ‌న‌కు ఆఫీసులో ఇద్ద‌రే పీఏలు ఉంటారట‌. వారు కూడా 8 గంట‌ల‌కు మించి ప‌నిచేయ‌రు. సెక్ర‌ట‌రీ అయితే.. ఒక్క‌రే. కుర్చీలు మార్చేందుకు.. సోఫాలు మార్చేందుకు నిధులు వెచ్చించ‌రు. అంతేకాదు.. సాధార‌ణ క్యాంటీన్‌కే ప‌రిమితి విధించారు. అంటే.. హైలెవిల్లో ఏదీ ఉండ‌దు. ఇక‌, కాన్వాయ్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ప్ర‌యాణించేందుకు ఒక కారు. దానికి ముందు ప్రొటోకాల్ ప్ర‌కారం పోలీసు వాహ‌నం అంతే!. కాగా.. 30 మంది స‌భ్యులున్న అసెంబ్లీలోనూ సీఎం పొదుపు మంత్రం గ‌త 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది.