మొన్న బెంగాల్.. నిన్న మోదీతో.. నేడు ఢిల్లీ.. రేపు అస్సాం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా చురుకైన పాత్ర పోషిస్తూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణ, ప్రధాన ప్రాజెక్టుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన పర్యటనలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ముఖ్యమంత్రి సువేందు ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి దాదాపు గంటకు పైగా కుటుంబ సభ్యులతో గడపడం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. అధికారిక పర్యటనలో భాగంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి ప్రధాని వెళ్లడం అరుదైన పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో పోలవరం ప్రాజెక్టు నిధులు, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, కీలక ప్రాజెక్టుల పురోగతిపై కూడా కేంద్ర మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యే చంద్రబాబు, సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహిస్తున్న బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, అమరావతి నిర్మాణంపై ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు.

రేపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరుకానున్నారు. అక్కడి నుంచి నేరుగా అమరావతికి తిరిగి చేరుకోనున్నారు. వరుసగా బెంగాల్, హైదరాబాద్, ఢిల్లీ, అస్సాం పర్యటనలతో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో తన చురుకుదనాన్ని మరోసారి చాటుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.